Madhu Yashki | హైదరాబాద్ : రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. మాజీ ఎంపీ మధయాష్కీ ఇంట్లో బుధవారం లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు 2009 – 2014 మధ్య కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారిని ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని పిలిచారు. మాజీ ఎంపీలు కేశవరావు (కేకే), గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయశాంతి, పొన్నం ప్రభాకర్లతోపాటు ఆనాడు కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఆనాడు ఉద్యమం సమయంలో ఎలా పోరాడారన్నదాన్ని నెమరువేసుకున్నారు. నాటి పోరాటాన్ని డాక్యుమెంటరీ చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. నాటి పోరాటాన్ని అతి త్వరలోనే ఒక పుస్తకంగా తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. మధుయాష్కీ గౌడ్ డాక్యుమెంటరీ, పుస్తక రచనకు చొరవ తీసుకోనున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చ జరిగినట్టు తెల్సింది. ప్రభుత్వంలో పక్కా కాంగ్రెస్ వాళ్లుండాలని, ప్రతిపక్షం సవాళ్లను తిప్పికొట్టాలని అనుకున్నారు.