లోయర్ పెనుగంగ ప్రాజెక్టు… 1978, ఆగస్టు 7న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నది. కానీ తెలంగాణ ఏర్పడేనాటికి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. చివరకు తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే చనాక-కొరాట బరాజ్ నిర్మించింది. అంటే మూడున్నర దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఊపిరి పోశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ 2004-2014 వరకు అంటే పదేండ్లు అధికారంలో ఉన్నది. జలయజ్ఞం కింద తెలంగాణలో 33 ప్రాజెక్టుల (18 మేజర్, 12 మీడియం, 2 ఆధునీకరణ, ఒకటి ఫ్లడ్ బ్యాంక్ పనులు) ద్వారా 2-5 సంవత్సరాల్లోనే 48.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ 33 ప్రాజెక్టుల్లో కేవలం అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలతోపాటు సుద్దవాగు మధ్య తరహా ప్రాజెక్టు మాత్రమే పూర్తయ్యింది. పదేండ్లలో ఆ పార్టీ కేవలం 92 వేల ఎకరాలకే సాగునీటి సౌలభ్యాన్ని చేకూర్చగలిగింది.
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో
పదేండ్ల నుంచి పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంచిన ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండేండ్లలోనే పూర్తి చేసింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి కేవలం ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఉన్న ఐదు లక్షల ఎకరాల బీడు భూముల్ని సిరులు పండించే మాగాణంలా మార్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తి చేసింది.
తెలంగాణలో ప్రస్తుతం ప్రాజెక్టులు, చెరువులు, బోర్ల కింద 1.12 కోట్ల పైచిలుకు ఎకరాలు సాగవుతున్నది. తెలంగాణ
ఏర్పడేనాటికి రాష్ట్రంలో నికరంగా సాగునీరు అందుతున్న భూమి విస్తీర్ణం సుమారు 22 లక్షల ఎకరాలు. అంటే… 2014 నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో అదనంగా దాదాపు 90 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నారు. అందుకే పంజాబ్ రాష్ర్టాన్ని వెనక్కి నెట్టి మూడున్నర కోట్ల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశానికే అన్నపూర్ణగా నిలిచింది తెలంగాణ.
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎలా సాగిందో? తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా-గోదావరి నదులపై ప్రాజెక్టుల పనులు ఎలా పరుగులు పెట్టాయో? చెప్పడానికి పై ఉదాహరణలు చాలు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ సాగునీటి వెతలు రాసుకుంటే రామాయణమంత! చెప్పుకుంటే మహా భారతమంత!! కానీ తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెండింగు ప్రాజెక్టుల్ని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చడంతోపాటు గోదావరిపై కాళేశ్వరం, కృష్ణాపై పాలమూరు-రంగారెడ్డి సహా అనేక భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవాన్ని తీసుకువచ్చింది. బోరుమన్న బోర్ల నుంచి నురగలు గక్కుతూ జలాలు చేలల్లో పడి పరుగులు పెట్టేలా చేసింది. అందుకే ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపిస్తున్నది. మరి… పట్టు తప్పి మళ్లీ పాత రోజులొస్తే?! ప్రాజెక్టులన్నీ పడకేస్తాయి. నదీజలాలన్నీ సముద్రం బాట పడతాయి. పచ్చని చేలన్నీ తిరిగి నోర్లు తెరిచే బీడు భూములుగా మారుతాయి. తింటున్న కంచాన్ని కాలితో తన్నుకుందామా?! మనమే తేల్చుకోవాలి.
నాడు విష వలయంలో తెలంగాణ ప్రాజెక్టులు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులంటేనే చుట్టూ విష వలయాలు. అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించడం… ఉన్న వివాదాల్ని జఠిలం చేయడం… ఆపై పర్యావరణ అనుమతుల్లో ఇరికించడం… ఇదంతా అప్పటి ఆనవాయితీ. తెలంగాణ అంతర్రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులన్నీ ఇంతే. ప్రతిపాదనలు రూపు దాల్చుకోవడానికి కొన్నేండ్లు. పక్క రాష్ట్రంతో సంప్రదింపులు మొదలుపెట్టేందుకు మరికొన్నేండ్లు. పనులు మొదలుకాకుండా అటకెక్కినవే చాలా.. అయితే, బతుకుజీవుడా!! అంటూ ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని. అయితే పూర్తయిన తర్వాత వంద శాతం ఫలితం వచ్చిన సాగునీటి ప్రాజెక్టు ఏ ఒక్కటీ లేదు. లోయర్ పెనుగంగపై తలపెట్టిన చనాక-కొరాట బరాజ్, లెండి నదిపై నిర్మించాల్సిన లెండి ప్రాజెక్టు, ప్రాణహితపై తలపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టు 1975లో మహారాష్ట్రతో ఒప్పందం జరిగాయి. వీటిలో లెండి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాక అటకపైనే ఉన్నాయి.
చనాక-కొరాట కూడా అంతే. ఒప్పందం జరిగిన నాలుగు దశాబ్దాల తర్వాతగానీ సాంకేతిక ఒప్పందం పూర్తి కాలేదు. ప్రాణహిత ప్రాజెక్టునైతే… ప్రాణహిత-చేవెళ్ల రూపంలో మహారాష్ట్రతో సంబంధం లేకుండానే చేపట్టారు. రూ.8 వేల కోట్లను బూడిదలో పోసిన పన్నీరులా మార్చారు. అంతెందుకు… ఇప్పుడు కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొంటున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితీ ఇంతే. 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే 1981లో ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. 1983లో నీటిని విడుదల చేయగా… 1984లో గేట్లను అమర్చారు. తెలంగాణ ఏర్పడేదాకా రెండో దశ, వరద కాల్వ అంటూ అది డక్కామొక్కీలు తింటూనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం పట్టుబట్టి పనులన్నీ పూర్తి చేయడంతోపాటు నీళ్లు పారకముందే శిథిలావస్థకు చేరుకున్న కాకతీయ కాల్వను కూడా పునరుద్ధరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన నాలుగైదేండ్లుగా ఎస్సారెస్పీ కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది.
కృష్ణాపైనా అదే దుస్థితి
గోదావరి నదిపైనే కాదు కృష్ణా నదిపై చేపట్టిన అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల దుస్థితి కూడా ఇలాగే ఉంది. జూరాల ప్రాజెక్టు బచావత్ ట్రిబ్యునల్ కనికరించి 18 టీఎంసీలు ఇస్తే నిర్మించాలని నిర్ణయించిన ప్రాజెక్టు. 1960 బచావత్ అప్పటి పూర్తయిన, ఆన్‌గోయింగ్, ప్రతిపాదిత ప్రాజెక్టుల కేటాయింపులు పూర్తి చేయగా కొన్ని టీఎంసీలు మిగిలాయి. దీంతో హైదరాబాద్ స్టేట్ ఏపీతో కలవడంతో అత్యధికంగా మహబూబ్‌నగర్ ఏడు లక్షల ఎకరాలకు సాగు నీటిని నష్టపోయిందనే విషయాన్ని బచావత్ దృష్టికి తెచ్చారు. అప్పుడు కనికరించి 18 టీఎంసీలను కేటాయించారు.
తర్వాత 1981లో ఎట్టకేలకు ప్రాజెక్టు మొదలైతే.. 2000 సంవత్సర కాలంలోగానీ నీటి విడుదల జరగలేదు. అంటే కేటాయింపులు జరిగిన నాలుగు దశాబ్దాలకుగానీ జనం నీటిని చూడలేదు. అయినప్పటికీ ఇప్పుడు దాని పూర్తిస్థాయి సామర్థ్యం 9.67 టీఎంసీలు.. లైవ్ స్టోరేజీ కేవలం 5.95 టీఎంసీలు. ఇప్పటి కల్వకుర్తి ప్రాజెక్టుకు కూడా 1991లో ప్రతిపాదనలు రూపొందించారు. జలయజ్ఞం కింద చేపట్టి అసంపూర్తిగా ఉంచితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చి దాన్ని పూర్తి చేసింది. ఇదీ ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి. భారీవే కాదు మధ్య తరహా ప్రాజెక్టులదీ ఇదే అవస్థ. ఇక చెరువులనైతే గొంతు నులిమి చుక్క నీరు నిల్వ ఉండకుండా చేశారు.
అదో… ధనయజ్ఞం!
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి సజీవంగా నిలిచాయి. 2005 నుంచి 2007 మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో 33 ప్రాజెక్టులు (18 మేజర్, 12 మీడియం, 2 ఆధునీకరణ, ఒకటి ఫ్లడ్ బ్యాంక్ పనులు) ఎంచుకున్నారు. 2-5 సంవత్సరాల్లో రూ.1.03 లక్షల కోట్లతో తెలంగాణలోని 48.521 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది జలయజ్ఞం లక్ష్యం. కానీ సరైన డిజైన్ లేకపోవడం, సాంకేతిక అంశాలను సరిగా చూసుకోకపోవడం, అధ్యయనం చేయకపోవడం, చివరకు భూసేకరణ, పర్యావరణ, రైల్వే, ఆర్అండ్బీ… ఇలా ఇతర శాఖల అనుమతులు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించారు.
ఈపీసీ విధానంలో ఇచ్చిన ఈ ప్రాజెక్టుల పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ జేబులో వేసుకొని పనులను గాలికొదిలిన కాంట్రాక్టర్లూ కొంతమంది ఉన్నారు. ఇలా కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు ఈ ప్రాజెక్టుల పనులు వివిధ కారణాలతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకంతోపాటు సుద్దవాగు మధ్య తరహా ప్రాజెక్టులు మాత్రమే పూర్తయిన వాటి జాబితాలో ఉన్నాయి. ఇలా పదేండ్ల పాటు ధనయజ్ఞ కార్యక్రమం ద్వారా రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు చేసి కేవలం 92 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించారు.
…? గుండాల కృష్ణ