రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్, జనవరి 29: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ 6వ వార్డు నాయకులు దూడం రజని-శ్రీనివాస్ దంపతులు, ఒకటో వార్డుకు చెందిన కాంగ్రెస్ నేత బూర బాలు తన అనుచరులతో గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరిన వారిని అభినందించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొన్నారు.
చందంపేట(దేవరకొండ)/ మరిపెడ/ జనగామ, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్లో చేరికల జోష్ పెరిగింది. బుధవారం 4వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఉలిగిల్ల చంద్రయ్య ఆయన సతీమణి స్వరూప ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. గురువారం 16వ వార్డుకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు ఎక్కలదేవి మోహనకృష్ణభార్గవ- సతీమణి ఆకాంక్షతోపాటు 100 మంది అనుచరులతో క్యాంపు కార్యాలయానికి వచ్చి బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గులాబీకండువా కప్పి ఆహ్వానించారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11 వార్డుల్లో బీఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి ఐనాల పరశురాములు ఆధ్వర్యంలో బీఎస్పీకి చెందిన 200 మంది మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి రెడ్యానాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు గులాబీ కండువాలుకప్పి ఆహ్వానించారు. దేవరకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్‌కు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, కేతావత్ రూప్లా, భవాని శ్రీధర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.