కొల్లాపూర్, జూన్ 23: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నది. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగుడలో మంగళవారం వాటర్ ట్యాంకును ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ నాయకులు అడ్డగించారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటమాట పెరుగడంతో బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు వార్డు సభ్యులపై దాడి చేశారు. కూల్చివేత సమయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లేకపోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. నిరుడు బీఆర్ఎస్ హయాంలో వాటర్ ట్యాంకును నిర్మించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ నిర్మించిన ట్యాంకు కండ్ల ముందు ఉండటం తట్టుకోలేక కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నిర్మాణాన్ని కూల్చేసి అక్కడి స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారనే ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే, ఉల్టా తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు. అనంతరం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, డీఈ మల్లేశ్వరరావు వివరణ కోరగా.. వాటర్ ట్యాంక్‌ను కూల్చిన విషయం తన దృష్టికి రాలేదని, కూల్చివేతకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.