Congress | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ‘నేను జానారెడ్డి లాంటి వాడినో, జైపాల్‌రెడ్డి లాంటి వాడినో కాదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు జానారెడ్డి, జైపాల్‌రెడ్డి అభిమానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అలా మాట్లాడడం జైపాల్‌రెడ్డిని, జానారెడ్డిని కించపరచడమే అవుతుందని, వారి గౌరవాన్ని తగ్గించడమే అవుతుందని మండిపడుతున్నారు. రేవంత్ తనను తాను హీరోగా చూపించుకునేందుకే జైపాల్, జానా లాంటి పెద్ద నేతలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అసలు వాళ్లు ఎందులో తక్కువ? వారిని తక్కువచేసి మాట్లాడడం ఏమిటి? అని నిలదీస్తున్నారు. రేవంత్ ఏదోఒకసారి అలా మాట్లాడితే పొరపాటు అనుకోవచ్చని, కానీ.. పదే పదే అలా మాట్లాడటం కచ్చితంగా వారిని అవమానించడమేనని గుస్సా అవుతున్నారు.
రాజకీయాల్లో జానారెడ్డి, జైపాల్‌రెడ్డిది ప్రత్యేకమైన స్థానం. కాంగ్రెస్ పార్టీలో వారి పాత్ర చాలా కీలకం. ఆ పార్టీ చరిత్రలో వారి పాత్ర ఎనలేనిది. రాజకీయ ఉద్ధండులుగా పేరుపొందిన వారికి ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. రాజకీయ మేధావులుగా పేరు గడించిన ఈ ఇద్దరు నేతల్లో జానారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగితే.. జైపాల్‌రెడ్డి ఏకంగా జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి రాష్ట్రంలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ముందు వరుసలో నిలిచారు. ఎన్టీఆర్ హయాంలోనే మంత్రిగా చేసిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి సుదీర్ఘ కాలంపాటు వివిధ కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. జైపాల్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలక వ్యక్తిగా పేరుపొందారు. లోక్‌సభ, రాజ్యసభలో సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన ఆయన.. రెండుసార్లు కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. జైపాల్‌రెడ్డి పనితీరుకు మెచ్చి కేంద్ర ప్రభుత్వం 1998లో ఆయనను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ అవార్డుతో సత్కరించింది. చట్టసభల్లో ఆయన చేసిన ప్రసంగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఎంతో గొప్ప రాజకీయ చరిత్రతో ప్రతిపక్షాలను సైతం మెప్పించగలిగిన జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తక్కువ స్థా యి వ్యక్తుల్లా రేవంత్‌కు ఎలా కనిపించారని, పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్‌కు మూడు దశాబ్దాలపాటు ఎనలేని సేవలు అందించిన జానారెడ్డి, జైపాల్‌రెడ్డి ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఒకానొక సందర్భంలో ఈ ఇద్దరు నేతలు ఆ పార్టీలో రెండో స్థానానికి చేరారు. కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు నేతలు అండగా నిలిచి, ఆ పార్టీని నిలబెట్టగలిగారు. కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయినప్పుడు రాజ్యసభలో జైపాల్‌రెడ్డి, ఇక్కడ జానారెడ్డి ప్రతిపక్ష నేతలుగా నిలబడి కొట్లాడారు. వారిని తక్కువ చేసి మా ట్లాడటం మానుకోవాలని, లేదంటే తమ పని తా ము చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. జానారెడ్డి, జైపాల్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్‌రెడ్డికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.