KTR | తెలంగాణ ఏర్పాటుకు ఒక ప్రత్యేకత ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పెద్ద చరిత్ర ఉందని.. తరాలు మారినా, స్వరాలు మారిన, వాస్తవాలు మారవని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచిపోయిందని తెలిపారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. 1952లో గైర్‌ముల్కీ ఉద్యమం జరిగింది.. అప్పుడు తుపాకీల మోతతో ఏడుగురిని బలికొన్న విలన్ కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే.. 12 ఏండ్లలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. 1968 నాటికే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు సారథులై నాయకత్వమై ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. 1968 నుంచి 1971 వరకు తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలిపారు. అప్పుడు 370 మంది విద్యార్థులను కర్కశంగా బలిగొన్నది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. మా తెలంగాణను మాకు ఇవ్వండని అడిగితే.. ఆనాడు ఉద్యమాన్ని అణిచివేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో సామాన్యమైన నినాదం కాదని కేటీఆర్ తెలిపారు. ఎత్తిన జెండా దించనని ప్రతినబూనిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అనిఅన్నారు. పోరాటం మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టాలని కేసీఆర్ ధైర్యంగా చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశంలో ఎక్కడా లేరని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ త్యాగం చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుందని తెలిపారు. కేసీఆర్‌తో తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలబడిందని తెలిపారు. తెలంగాణకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే అని స్పష్టం చేశారు.