Telangana | కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నికల కుంపటి రాజుకున్నది. ఫిరాయింపు స్థానాల్లో ముసలం పుట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్‌గా మారింది. టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు మొదలయ్యాయి. టికెట్ నాకంటే నాకంటూ ఢీ కొట్టుకుంటున్నారు. వలస కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే సహించే ప్రసక్తే లేదంటూ అసలు కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
హైదరాబాద్/సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కాంగెస్‌లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయమై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫిరాయింపులపై మూడు నెలల్లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని అ సెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీంతో జంప్ జిలానీల 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు దాదాపుగా ఖాయమయ్యాయి. ఈ నేపథ్యం లో జంప్ జిలానీల గుండెల్లో గుబులు మొదలైంది. అన్ని వైపుల నుంచి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు అసలు కాంగ్రెస్ నేతలు సైతం వ్యతిరేకిస్తుండటంతో దిక్కుతోచని స్థితి లో పడిపోయారు.
ఈ పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య ఉప ఎన్నికల కుంపటి రాజుకోవడంతో కాంగ్రెస్ పెద్దలు సైతం తలపట్టుకుంటున్నారు. ఈ గండం నుం చి ఎలా గట్టెక్కాలో తెలియక అయోమయంలో పడిపోయారు. అసలు కాం గ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య సయో ధ్య కుదర్చడం సవాల్‌గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి గెలిచిన దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), సంజయ్‌కుమార్ (జగిత్యాల), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కాలె యాదయ్య (చేవెళ్ల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) ఆ తర్వాత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు.
ఢీ అంటే ఢీ
గత ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా పోటీచేసిన నేతలు ఆ తర్వాత ఫిరాయింపులతో ఒకే పార్టీలో ప్రత్యర్థులుగా మారడం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ ప్రత్యర్థి తమ పార్టీలో చేరి తమపైనే పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చి ఎప్పటి నుంచి పార్టీలో ఉంటూ, పార్టీని కాపాడుకుంటూ, పార్టీ కోసం బతుకుతున్న తమపై అజమాయిషీ చేయడంపై భగ్గుమంటున్నారు. పార్టీ పథకాల అమలులో, నామినేటెడ్ పోస్టుల భర్తీలో, ప్రొటోకాల్ పాటింపు విషయంలో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నా తమ వారికి పదవులు, ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అసలు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో నామినెటెడ్ పదవులన్నీ జంప్ జిలానీ నేతల అనుచరులకు కట్టబెడుతున్నారంటూ మండిపడుతున్నారు. దీంతో అసలు కాంగ్రెస్ నేతలు వలస కాంగ్రెస్ నేతలను తమ పార్టీ వారిగా గుర్తించడం లేదు. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ రెండు వర్గాలుగా విడిపోయి ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలు సైతం వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జంప్జిలానీలున్న 10 స్థానాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పాత కాంగ్రెస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ బద్ధ శత్రువులుగా ఉంటున్నారు.
అసలు నేతల వార్నింగ్
10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో టికెట్ల రగడ మొదలైంది. ఉప ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అటు గతంలో ఓడిన నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలిసింది. టికెట్ల కోసం ఇప్పటి నుంచే సిగపట్లు పడుతున్నట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్ దక్కకుండా అసలు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తుంటే, మళ్లీ టికెట్ దక్కించుకొని బరిలో నిలవాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఫిరాయింపుదారులకు టికెట్లు ఇవ్వొద్దని అసలు కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ కాదు కూడదని వలస కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ఎన్నికల్లో వారికి సహకరించే ప్రసక్తే లేదని తెచ్చి చెప్తున్నట్టు తెలిసింది.
జంప్ జిలానీల గుండెల్లో గుబులు
ఉప ఎన్నికలు దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో జంప్ జిలానీల గుండెల్లో గుబులు మొదలైంది. ఉప ఎన్నికల్లో గెలుపుపై అంతర్మథనంలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు లేదని వారే చెప్తున్నట్టు తెలిసింది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు తమను గెలుపు తీరాలకు చేర్చాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నా రు. దీంతోపాటు పార్టీ మారారనే ఆగ్రహం కూడా తమపై ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తాము చేసిన తప్పుతో వచ్చిన వ్యతిరేకతతో ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని ఆందోళన చెందుతున్నారు.
జీవన్‌రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్
జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతున్నది. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి ఒకవైపు ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మరోవైపు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పలు సందర్భాల్లో బాహాటంగానే వీరు రచ్చకెక్కుతున్నారు. సంజయ్‌కుమార్ చేరికను జీవన్‌రెడ్డి బహిరంగంగానే విమర్శించారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే టికెట్ రేసులో తాను ఉన్నానని జీవన్‌రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు.
పోచారం వర్సెస్ రవీందర్‌రెడ్డి
బాన్సువాడలో కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన చేతిలో ఓడిన ఏనుగుల రవీందర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గంలో రవీందర్‌రెడ్డి చెప్పిందే వేదంగా మారడం పోచారానికి మింగుడుపటడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్ కోసం ఎవరికి వారే ఇప్పటి నుంచి లోపాయికారీగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
బండ్ల వర్సెస్ సరిత
గద్వాల నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్సెస్ అసలు కాంగ్రెస్ నేత సరిత తిరుపతయ్యగా మారింది. గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. ఈ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.
గూడెం వర్సెస్ నీలం, గాలి, కాట
పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం మూడు ముక్కలాటలా మారింది. వలస నేత, ఫిరాయింపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వర్సెస్ అసలు కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్, గాలి అనిల్‌కుమార్, నీలం మధు మధ్య అంతర్గత పోరు పతాకస్థాయికి చేరింది. ఉప ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు కాట, గాలి, నీలం ముగ్గురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ గూడెం మహిపాల్‌రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిస్తామని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నట్లుగా సమాచారం.
కడియం వర్సెస్ ఇందిర
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి వచ్చే ఉప ఎన్నికలో అధికార పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్న కడియం శ్రీహరికి బదులుగా ఆ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న సింగారపు ఇందిరకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్నది. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇందిర ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న పదేండ్లు కాంగ్రెస్ పార్టీని కాపాడిన తనకే ఉప ఎన్నికలో అవకాశం ఇవ్వాలని ఇందిర కోరుతున్నారు. అలాగే, భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్య వర్గపోరు నడుస్తున్నది.
ఖైరతాబాద్‌లో హోరాహోరీ
ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీఎం అనుచరుడు రోహిన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు, ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నారు.
శేరిలింగంపల్లిలో ఎవరికి వారే
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత కార్పొరేటర్, గతంలో పోటీచేసిన జగదీశ్వర్‌గౌడ్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఎంబీసీ చైర్మన్ జైపాల్, పొంగులేటి శ్రీనివాస్ అనుచరుడు రఘునాథ్ యాదవ్ సైతం టికెట్ కోసం మంతనాలు చేస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌లో జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, సీఎం రేవంత్ ప్రధాన అనుచరుడు జైపాల్‌రెడ్డి, నరేందర్ ముదిరాజ్ సైతం టికెట్‌పై గురి పెట్టారు. చేవెళ్లలో భీం భరత్, షాబాద్ దర్శన్, సున్నపు వసంతం కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఇక పటాన్చెరులో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అనుచరుడు కాట శ్రీనివాస్‌గౌడ్, ముదిరాజ్ నాయకుడు నీలం మధు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌పై ఎవరికి వారే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఖాళీ ఏర్పడిన జూబ్లీహిల్స్‌లోనూ తీవ్ర పోటీ నెలకొన్నది. సామదానభేద దండోపయాలు ఉపయోగించ గల నాయకులు జూబ్లీహిల్స్ టికెట్ కోసం తీవ్రంగా తలపడుతున్నారు. ఈ టికెట్ తనదేనని ఆ పార్టీ మాజీ ఎంపీ, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మహ్మద్ అజారుద్దీన్ ఇప్పటికే ప్రకటించుకున్నారు. అలాగే, నవీన్‌యాదవ్, మురళీగౌడ్ సైతం ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు అంజన్‌కుమార్‌యాదవ్ కూడా టికెట్ కోసం మంతనాలు చేస్తున్నట్టు తెలిసింది. సీఎన్ రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, మైనంపల్లి హన్మంతరావు, ఖురేషీ సైతం జూబ్లీహిల్స్ టికెట్ కోసం పరితపిస్తున్నట్టు సమాచారం.