సీపీఎస్‌ను రద్దుచేస్తామని ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైంది. పలుమార్లు మంత్రులను కలిసి సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరాం. జీవో-317, సీపీఎస్ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేవి కావు. కానీ, ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత త్వరగా సీపీఎస్‌ను రద్దుచేయాలి.
– ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ‘ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుచేస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అభయహస్తం కింద ఇచ్చిన గ్యారెంటీ. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం సీపీఎస్ రద్దు ఊసే ఎత్తకపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ తమను మోసం చేసిందన్న భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 40 శాతానికిపైగా ఉద్యోగులు సీపీఎస్ విధానంతో నష్టపోతున్నారు. 2004 తర్వాత నియామకమైన వారిని సీపీఎస్ పరిధిలోకి చేర్చారు. దీంతో 2004 తర్వాత నియామకమైన వారంతా పాత పెన్షన్ విధానం కోల్పోయారు. వీరంతా సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే అంశంపై పలు మార్లు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులను కలిసినా ‘చేస్తాం.. చూస్తాం’ అన్న మాటలే కానీ, ఇంతవరకు సీపీఎస్‌ను రద్దుచేసే ప్రయత్నాలేవీ సాగడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఓపిక నశించిన ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జూలైలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తమ తడాఖా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు.
సగం వేతనం స్థానంలో..
సీపీఎస్ అనేది కేవలం ఉద్యోగి చందా అధారిత స్కీం. ఈ పథకంలో ఉద్యోగుల మూలవేతనం, డీఏల నుంచి ప్రతి నెలా 10% చొప్పున కట్ చేస్తారు. ప్రభుత్వం కూడా మరో 10% చందాను జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఎన్పీఎస్-ఎన్ఎస్డీఎల్కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగికి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్)లో ఈ మొత్తాన్ని జమచేస్తున్నారు. దీనిని ఎన్ఎస్డీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్యాంకులకు బదిలీచేసి, అక్కడినుంచి స్టాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత 60% సొమ్మును చెల్లించి, మిగతా 40% సొమ్మును స్టాక్ మార్కెట్లో కొనసాగిస్తూ లాభనష్టాలతో కలిసి ఎంతోకొంత పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. షేర్లు నష్టాల్లో కొనసాగితే పెన్షన్ మొత్తం మైనస్‌లోకి పోతుంది. స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు, షేర్ల పెట్టుబడుల్లో ఉద్యోగులకు ఎలాంటి హక్కులు లేకపోవడంతో రిటైర్ అయిన ఉద్యోగులకు నెలకు రూ.1,800-2,000 పెన్షన్ కూడా అందడంలేదు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండటంలేదు.
తెచ్చింది కాంగ్రెస్సే..
రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. 2004లో అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీపీఎస్‌ను వర్తింపజేస్తూ జీవో-653ని జారీచేసింది. ఈ మేరకు ఏపీ పెన్షన్ రూల్స్-1980ని అప్పటి ప్రభుత్వం సవరించింది. ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రంలోని ఉద్యోగులందరినీ రోడ్డున పడేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దుచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏకంగా అభయహస్తం అంటూ మ్యానిఫెస్టోలో చేర్చింది. కానీ, ఆ దిశగా కనీస చర్యలు చేపట్టకపోవడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ ఆరు నెలల్లో క్యాబినెట్ సమావేశాలు సహా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా సీపీఎస్ రద్దును కనీసం ప్రస్తావించడంలేదంటే ఆ పార్టీ ప్రభుత్వానికి ఈ అంశంపై ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. ఇక విచిత్రమేంటంటే రాష్ట్రంలో 2003 డీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా టీచర్లను నియమించారు. నోటిఫికేషన్‌ను 2003లోనే ఇచ్చినా, ఉద్యోగాలను 2004లో భర్తీచేశారు. వాస్తవానికి నోటిఫికేషన్‌ను ప్రామాణికంగా తీసుకుని సీపీఎస్‌ను అమలుచేయాల్సి ఉండగా, పోస్టింగ్ తేదీ ఆధారంగా సీపీఎస్‌ను అమలుచేయడం ఆయా టీచర్ల పాలిట శాపంగా మారింది. ఇందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. తమను సైతం సీపీఎస్ నుంచి మినహాయించాలని 2003 డీఎస్సీ టీచర్లు కోరుతున్నారు.
ఉత్తర భారతానికో రూల్.. దక్షిణ భారతానికో రూల్..
సీపీఎస్ రద్దు నేడు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఎజెండాగా మారింది. సీపీఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతానికో రూల్, దక్షిణ భారతదేశానికో రూల్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. సీపీఎస్‌ను రద్దుచేస్తామన్న హామీతోనే కాంగ్రెస్ పార్టీ గతంలో రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ ఇదే హామీనిచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన జేఎంఎం అధికారంలో ఉన్న జార్ఖండ్‌లోనూ ఓపీఎస్‌ను అమలుచేస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో ఉద్యోగులకు పాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు సైతం ఇచ్చారు. అయితే, దక్షిణాదిలోని కర్ణాటకలోనూ సీపీఎస్‌ను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకూ నెరవేర్చలేదు. ఇదే తరహాలో తెలంగాణలో సీపీఎస్ నినాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, ఈ రెండు రాష్ర్టాల్లో సీపీఎస్‌ను రద్దుచేయలేదు. ఉత్తర భారతానికి ఒక రూల్.. దక్షిణ భారతానికి ఒక రూల్ ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
సీపీఎస్‌తో ఉద్యోగులకు తీరని నష్టం కలుగుతున్నది. పెన్షన్‌పై భరోసాలేకుండా పోతున్నది. ఈ విధానంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉద్యోగులంతా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఉద్యోగుల సహకారంతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పారు. ఉద్యోగులు చిరకాల వాంఛను నెరవేర్చి ఉద్యోగుల మనసు గెలుచుకోవాలి.
-మారం జగదీశ్వర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాలు