హైదరాబాద్, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని చాటుకున్నది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసినట్టే, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకు ముందే ఏకంగా సొంత పార్టీ నేతలనే మోసం చేస్తున్నది. ఏండ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనబెట్టి, పారాచూట్ నేతలకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తామని, పారాచూట్ నేతలకు ఇచ్చే ప్రసక్తే లేదని నాలుగు నెలల క్రితం వరంగల్ సభలో రాహుల్‌గాంధీ చెప్పిన మాటలన్నీ ఉత్త ప్రగల్భాలేనని తేలిపోతున్నది. సర్వేలు, సెర్చింగ్లు ఇలాంటివేవీ లేకుండానే బడా నేతలుగా పేరున్నవారికి, లాబీయింగ్ చేసుకుంటున్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యక్తమవుతున్నాయి. దీంతో నియోజకవర్గాల్లో ప్రజాదరణ లేని నేతలు కూడా ఢిల్లీకి క్యూ కట్టి లాబీయింగ్‌ల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పారాచూట్ నేతలే దిక్కు
ఎన్నికల ముంగిట్లో ఇతర పార్టీల నుంచి వాలిపోయిన పారాచూట్ నేతలే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ, ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలను వారికే అప్పగిస్తున్నారు. టికెట్ల కేటాయింపులోనూ వారికే పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటి నేతలను చేర్చుకున్న కాంగ్రెస్.. మరికొంత మంది వలసజీవులపై దృష్టి పెట్టింది. మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం వంటి వారికి చేరికలకు ముందే టికెట్ హామీ ఇస్తుండటంపై ఆయా నియోజకవర్గాల్లోని క్యాడర్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమకు అన్యాయం చేస్తూ ఇతర పార్టీ నేతలను అందలం ఎక్కించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.