Mallu Ravi | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఒక్కో కమిటీలో ఐదారుగురు సభ్యులు ఉండనుండగా, కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలనే నియమించనున్నది. వీరంతా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియాకు వెల్లడించారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా పెట్టుబడుల కోసం ఈ నెల 14న సీఎం సహా మంత్రి శ్రీధర్‌బాబు దావోస్ వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీకి స్వాగతం పలకటంతో పాటు గత ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేకు అభినందనలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పోటీ చేయాలని తీర్మానం చేశారు.
టార్గెట్ 12 సీట్లు
సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలనేదానిపై కార్యాచరణ రూపొందించారు. 12 స్థానాలకు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 8, 9 తేదీల్లో రోజుకు ఐదు ఉమ్మడి జిల్లాల చొప్పున సమీక్షస్తానని తెలిపారు. 11, 12, 13 తేదీల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇన్చార్జీలు, మంత్రులు సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థుల గెలుపు కోసం ఏం చేయాలనేదానిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 20 తర్వాత తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అతి త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని, కష్టపడిన వారికి మాత్రమే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. కాగా, తొలి దశలో 20 నామినేటెడ్ పోస్టులను సంక్రాంతి వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నది.
కలిసికట్టుగా పని చేయండి: మున్షీ
పార్లమెంట్‌తో పాటు మరిన్ని ఎన్నికలు ఉన్నందున పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింతగా శ్రమించాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ పిలుపునిచ్చారు. కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఫలితాలను మించి పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు సాధించాలని అన్నారు. ఇందుకోసం నాయకులంతా మరింత కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు గొప్ప అవకాశం ఇచ్చారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల కష్టానికి ఫలితం దక్కిందని, పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇదే ఉత్సాహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత బలహీనంగా ఉంటుందని జోస్యం చెప్పారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
మల్లు రవికి గాంధీభవన్‌లోకి నో ఎంట్రీ!
కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను పోలీసులు గాంధీభవన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. గాంధీభవన్ వర్గాలు ఇచ్చిన జాబితా ప్రకారమే నేతలను లోపలికి అనుమతించగా, ఆ జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో పోలీసులు ఆయనను లోపలికి పంపలేదు. దీంతో ఆయన పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తననే అడ్డుకుంటారా? అని హంగామా చేయటంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీభవన్‌లోకి అనుమతించని పార్టీ ఇతర నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర అసహనానికి గురయ్యారు. అధికారంలోకి వచ్చాక తమను గేటు వద్దే ఉంచేస్తారా? అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.