హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత బొమ్మర రామ్మూర్తి డిమాండ్ చేశా రు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. కొల్లాపూర్, రామాయంపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను భయపెట్టిందని మండిపడ్డారు.
గత రెండ్రోజులుగా అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎన్నికల సంఘం పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నదని ఆరోపించారు. కొన్నిచోట్ల మంత్రులు తమ కాన్వాయ్‌లో ఓటర్లను తీసుకెళ్లి ఓట్లు వేయించినా అధికారులు ఎం దుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు సదానందం, కిరణ్‌గౌడ్, ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.