Minister Jagadish Reddy | దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతర్ధానమైనట్లేనని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి తొలగిస్తే ఆ పార్టీకి సోయి లేకుండా పోయిందని, ఆ పార్టీ జీవచ్చవంలా మారింది అనేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా సోమవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు మండల కేంద్రంతో పాటు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏపల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎమ్మెల్యే నోముల భగత్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపొంతరం చెందిందన్నారు. యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు. మహారాష్ట్రతో సహా భారతదేశంలోనీ రైతాంగం, రైతు సంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరేందుకు బారులు తీరుతున్నారన్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో రైతు విప్లవం మొదలైందని, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు చేరుకొని అక్కడ తిరుగుబాటుకు శంఖారావం పూరిస్తున్నారన్నారు.
రైతుబీమా కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతాంగం గుంట, అరగుంట భూములు కొనుగోలు చేయడంతో పాటు తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ కోసం బోర్లు వేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ ఏలుబడిలో దేశంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందని విమర్శించారు. మోదీ ఏలుబడిలో సుదీర్ఘ కాలం ఉన్న గుజరాత్లో దారిద్య్రం ఆరున్నర శాతం నుంచి 8.5శాతానికి పెరగడమే ఇందుకు అద్దం
పడుతుందన్నారు. 27 రాష్ట్రాల్లో ఇప్పటికీ ఒక్క పూట పస్తులు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కపూట భోజనాలకే పరిమితమై దేశంలో పస్తులుంటున్న వారి శాతం 35 నుంచి 40 శాతానికి చేరుకుందన్నారు. సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల కంటే మన దేశంలో అందులో మోదీ పాలనలోనే దారిద్య్రం పెరిగిందని ఆరోపించారు.