కరీంనగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/ జగిత్యాల): జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉప ఎన్నిక వస్తే పార్టీ రెండుగా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. గులాబీ గుర్తుపై గెలిచి ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి.. హస్తం గూటికి చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై ఆది నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ నేత జీవన్‌రెడ్డి గుర్రుగా ఉన్నా రు. పలు సందర్భాల్లో సంజయ్‌కుమార్, జీవన్‌రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.
సంజయ్ చేరికపై తగ్గని వేడి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ ఫిరాయించినప్పుడు మాట మాత్రమైనా తనకు చెప్పకుండా కాంగ్రెస్ పెద్దలు చేర్చుకున్నారంటూ జీవన్‌రెడ్డి బాహాటంగానే నిరసన వ్యక్తంచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన డాక్టర్ సంజయ్‌కుమార్ జీవన్‌రెడ్డి చేతిలో ఓటమి పొందారు. ఆ తదుపరి 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన సంజయ్‌కుమార్ జీవన్‌రెడ్డిని ఓడించారు. 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందగానే కొన్నాళ్లకే గుట్టుచప్పుడు కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఢిల్లీకి చేరిన జగిత్యాల పంచాయితీ
కాంగ్రెస్ పార్టీ ఆడిన డ్రామాపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి భగ్గుమన్నారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడంపై నిప్పులు కక్కారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరికలు జారీచేశారు. కాంగ్రెస్ శ్రేణులు సంజయ్‌కుమార్ రాకను తీవ్రంగా నిరసిస్తూ ఆందోళన కూడా నిర్వహించాయి. జగిత్యాల హస్తం పంచాయితీ ఢిల్లీకి చేరడంతో అధిష్ఠానం జీవన్‌రెడ్డిని బుజ్జగించగా.. కొంత మెత్తబడ్డారు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉన్నది.
నిలిచిన పోస్టుల భర్తీ
జీవన్‌రెడ్డి, సంజయ్‌కుమార్ మధ్య వర్గపోరు పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. నియోజకవర్గంతోపాటు, జిల్లాకు చెందిన నామినేటెడ్ పోస్టుల భర్తీ నిలిచింది. చివరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కమిటీలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల నియామకాల విషయంలోనూ ఇక్కడ స్పష్టత కరువైంది.
జీవన్‌రెడ్డి మాటల తూటాలు
ఎమ్మెల్యే సంజయ్‌ని చేర్చుకొని తనకు ప్రాధాన్యం తగ్గించారని భావిస్తున్న జీవన్‌రెడ్డి పార్టీపైన, ఎమ్మెల్యేపైన మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. ఇటీవల సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహూల్‌గాంధీ పెట్టిన పాంచ్‌న్యాయ్ విధానాన్ని పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డిని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జీవన్‌రెడ్డి వర్గానికి చెందిన గంగారెడ్డి నిరుడు దారుణహత్యకు గురికావడంపై ఎమ్మెల్యే పై జీవన్‌రెడ్డి బాహాటపు విమర్శలు గుప్పించారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలో రూ.70 కోట్ల అభివృద్ధి పనులను నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వియ్యంకుడు దక్కించుకున్నాడంటూ జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సైతం లేఖ రాయడం, ఇద్దరి మధ్య మరింత అగ్గి రాజేసింది. జీవన్‌రెడ్డిపై సంజయ్‌కుమార్ సైతం అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జీవన్‌రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందేనని, టీడీపీకి వెన్నుపోటు పొడిచింది ఎవరో తెలుసునంటూ ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన సంజయ్‌కుమార్‌కు టికెటిస్తే.. ఆయన గెలుపు కోసం జీవన్‌రెడ్డి వర్గం సహకరించే పరిస్థితి లేదు. గులాబీ పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తీరుపై ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఒకవేళ జీవన్‌రెడ్డికి టికెటిస్తే.. సంజయ్ వర్గం సహకరించే పరిస్థితులు లేవు.