CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరినట్టు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలన్న ప్రతిపాదనను వెంటనే ఆమోదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో రాజ్యాంగ, న్యాయపరమైన అనేక చికులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. వీటిపై చట్టసభలు, న్యాయస్థానాల్లో అభిషేక్ మను సింఘ్వీ గట్టిగా వాదిస్తారని చెప్పారు. మాజీ ఎంపీ కేకే పెద్దమనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని సీఎం రేవంత్ కొనియాడారు. సింఘ్వీ సోమవారం నామినేషన్ వేస్తారని చెప్పారు. రైతు కృతజ్ఞత సభ, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిషరణపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలు వెల్లడిస్తామన్నారు.