Telangana | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి మంగళవారం మరో రూ.2,800 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ.1000 కోట్ల విలువైన రెండు బాండ్లను 22 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 800 కోట్ల విలువైన బాండును 25 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐకి జారీచేసింది. మంగళవారం జరిగిన వేలంలో పాల్గొని 2,800 కోట్ల రుణం పొందింది. 7న ఆర్బీఐ నిర్వహించిన వే లంలో పాల్గొని రూ.3000 కోట్ల రుణాన్ని సేకరించింది. 14, 21న నిర్వహించిన వేలంలో పాల్గొనలేదు. చివరి మంగళవారం నాడు పాల్గొని మూడు బాండ్ల ద్వారా 2,800 కోట్లు సమీకరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్రం 49,255 కోట్లకు విధించగా, ఇప్పటికే రేవంత్ప్రభుత్వం మూడు త్రైమాసికాల్లో తీసుకున్న రుణం రూ.41,759 కోట్లకు చేరింది.
కేంద్రం అనుమతించిన అప్పులో ఇంకా రూ.7,500 కోట్ల వరకు రుణాలు చివరి త్రైమాసికంలో తీసుకొనే అవకాశం ఉన్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చివరి త్రైమాసికంలో ఏకంగా రూ.30 వేల కోట్ల అప్పు (నెలకు రూ.10 వేల కోట్ల చొప్పున) తీసుకుంటామని ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. 7న రూ.3000 కోట్లు, 14న రూ.2000 కోట్లు, 21న రూ.2500 కోట్లు, 28న మరో రూ.2500 కోట్లకు ఇండెంట్లు ఇచ్చింది.
వీటి కోసం కేంద్రం నుంచిగానీ, ఆర్బీఐ నుంచిగానీ ముందస్తు అనుమతి తీసుకోలేదు. దీంతో అదనపు అప్పు ఇవ్వబోమని కేంద్రం తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. అందుకే ఈ నెల 14, 21న వేలం లో పాల్గొనటానికి అవకాశం లభించలేదు. ఈ నెలలో రెండు దఫాలుగా (7, 28 తేదీల్లో) రూ.5,800 కోట్ల అప్పును మాత్రం రాష్ట్రం తీసుకోగలిగింది. ఫిబ్రవరి, మార్చిలో కూడా 10 వేల కోట్ల చొప్పు న ఆర్బీఐకి ఇండెంట్లు పెట్టింది. ఎంతమేరకు రుణం పొందేందుకు అవకాశం లభిస్తుందో చూడాల్సి ఉన్నది.