నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికీ 19 స్థానాలకు అభ్యర్థులనే ప్రకటించలేదు. సరైన నాయకుల్లేరని భావిస్తున్న కాంగ్రెస్.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారికోసం ఎదురు చూస్తున్నది. ప్రకటించిన వనపర్తి, చేవెళ్ల, బోథ్లకూ అభ్యర్థులను మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం.
Congress | హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో తికమకపడుతున్నది. ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అధిష్ఠానం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. వనపర్తి, చేవెళ్ల, బోథ్ నియోజకవర్గాల అభ్యర్థులపై సమీక్షించాలని, వారికి బీ ఫారాలు ఇవ్వొద్దని అధిష్ఠానం ఆదేశించినట్టు సమాచారం.
వీటితోపాటు మరో మూడు నాలుగు స్థానాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. తొలి జాబితాలో చేవెళ్ల(ఎస్సీ) నుంచి పామెన భీమ్‌భరత్, రెండో జాబితాలో వనపర్తి నుంచి సీనియర్ నేత చిన్నారెడ్డి, బోథ్ నుంచి వెన్నెల అశోక్‌ను అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే, వీరు బలమైన అభ్యర్థులు కాదన్న అభిప్రాయానికి వచ్చిన అధిష్ఠానం వీరిని మార్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో మెఘారెడ్డికి, బోథ్‌లో వెన్నెల అశోక్ స్థానంలో నరేశ్‌జాదవ్‌కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.
మొత్తం జాబితాపైనే అనుమానాలు
ముగ్గురు అభ్యర్థుల మార్పు నిర్ణయం నేపథ్యంలో మొత్తం జాబితాపైనే పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయోనని వ్యాఖ్యానిస్తున్నారు. ఆది నుంచీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఆరోపణలున్నాయి. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నా దీనిని పార్టీ కార్యకర్తలు విశ్వసించడం లేదు. ఒకవేళ సర్వేల ప్రకారమే టికెట్లు ఇస్తే ఇప్పుడు మళ్లీ అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వేలను పలువురు కీలక నేతలు ప్రభావితం చేశారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని సీట్లలో కీలక నేతలు ‘నాకిన్నీ.. నీకిన్నీ’ చొప్పున పంచుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిష్ఠానం వద్ద పైరవీలు చేసి తమకు అనుకూలమైన వారికి టికెట్లు ఇప్పించుకున్నట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నది. మూడు స్థానాల్లో అభ్యర్థులపై పున:సమీక్షించాలని పార్టీ భావించడంతో ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరినైట్టెంది. దీంతో మిగిలిన అభ్యర్థులపై కూడా సమీక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇంకా 19 స్థానాలు పెండింగ్‌లోనే..
ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కాంగ్రెస్ ఇప్పటికీ 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు దొరకకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇద్దరు ముగ్గురు నేతల్లో కాస్త మెరుగ్గా ఉన్న నేతకు టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో మిగిలిన నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన కూడా తమతో సమానమేనని, తమ కన్నా ఎక్కువేమీ కాదని మిగిలిన అభ్యర్థులు వాదిస్తున్నారు. దీంతో ఆ 19 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని పేర్లతో ఒక జాబితా, మరికొన్ని పేర్లతో మరో జాబితాను ఇచ్చే అవకాశం ఉన్నదని తెలిసింది. మిగిలిన 19 స్థానాల కోసం ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. దీంతో సొంతంగా అభ్యర్థులను నిలుపుకొలేని మనం.. భవిష్యత్‌లో ఏం చేయగలమని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.