హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : దేశానికి రాహుల్‌గాంధీ నాయకత్వం అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాహుల్ ప్రధాని కావాలని, అప్పుడు దేశ ఆత్మగౌరవాన్ని నిలబెడతారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా, సైనికులకు సంఘీభావంగా ఏఐసీసీ పిలుపుమేరకు బాచుపల్లిలో గురువారం జైహింద్ యాత్ర నిర్వహించారు. అనంతరం నిజాంపేటలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ… అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ భయపడి నాలుగు రోజులకే యుద్ధవిరమ ణ చేశారని విమర్శించారు. దేశభద్రతను ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. యుద్ధం చేసే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించిన మోదీ.. కాల్పుల విరమణకు ముందు మాత్రం అఖిలపక్షాలను సంప్రదించలేదని విమర్శించారు.
యుద్ధం చేయాలని వీరతిలకం దిద్ది పంపిస్తే ఉట్టి చేతులతో తిరిగి వచ్చారని ఆరోపించారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునే శక్తి బీజేపీ ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. పాక్‌తో యుద్ధంలో మన దేశానికి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత లాభం కోసం వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకొచ్చారని అన్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.