హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతిపక్ష ఎమ్మెల్యేల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నదో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తన వ్యక్తిగత ఆలోచన ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనే తన ఆలోచనా విధానమని స్పష్టం చేశారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకమని, ఇందుకు సంబంధించి జాతీయస్థాయిలో ‘పాంచ్‌న్యాయ్’ పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోలోనే హామీ ఇచ్చామని తెలిపారు. ఎవరైనా ఎమ్మెల్యే పార్టీ మారితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టంలో సవరణలు చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు తెలిపారు. పార్టీ విధానం మేరకే తాను పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. మంగళవారం బేగంపేటలోని తన నివాసం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు.
రాజకీయ పార్టీకి సంఖ్యాబలం ముఖ్యం కాదని, మ్యాజిక్ ఫిగర్ మాత్రమే ముఖ్యమని జీవన్‌రెడ్డి తెలిపారు. సంఖ్యాబలంతో పార్టీ బలోపేతం అవుతుందనుకోవడం తప్పని పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు105 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ బీఆర్ఎస్ ప్రజావ్యతిరేకతను మూగట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పార్టీ బాధ్యతతో పనిచేస్తుందని తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల, చేరికల వల్ల పార్టీపై ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఐదేండ్లు స్థిరంగా ఉంటుందన్న ఆయన పథకాల అమలుపై దృష్టిసారించాలని సూచించారు. ‘జీవన్‌రెడ్డి మంత్రి పదవి డిమాండ్ చేస్తున్నారా’ అన్న ప్రశ్నకు.. తాను ఏ పదవినీ ఆశించడం లేదని, తనకు పదవి ముఖ్యం కాదని, ఆత్మగౌరవమే ముఖ్యమని స్పష్టం చేశారు.
పార్టీలో పాతతరం నేతలకు గౌరవం దక్కడం లేదంటూ జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. సీనియర్లను పార్టీ నుంచి పంపించేందుకు పొగ పెడుతున్నారా? గౌరవం దక్కడం లేదా? అన్న ప్రశ్నలకు జీవన్‌రెడ్డి బదులిస్తూ.. ‘న్యాచురల్లీ, ఇది నా నోటి నుంచి చెప్పించాలా? మీ అందరికీ అది కనిపించడం లేదా?’ అని తిరిగి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో తనకు 40 ఏండ్ల అనుబంధం ఉందని, ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని, కొనసాగుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీని వీడే పరిస్థితులు కల్పిస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పారు.