Jeevan Reddy | కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఇప్పటికే అసహనంతో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అయితే పార్టీ మారే ఆలోచన ఇప్పటివరకు అయితే లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వచ్చి మాట్లాడారని జీవన్ రెడ్డి తెలిపారు. తనతో కాంగ్రెస్ ఇన్ఛార్జీ దీపదాస్ మున్షీ కూడా మాట్లాడారని పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి తనకు కాల్స్ రాలేదని తెలిపారు. ఈ స్టేజ్‌లో పార్టీ నుంచి గౌరవం కోరుకున్నా.. కానీ ఈ రోజు తనకు ఆ గౌరవం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పార్టీ ప్రతి నిర్ణయాన్ని పాటించానని తెలిపారు . నష్టం కలిగినా పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్నా చేశానని పేర్కొన్నారు. తన ప్రమేయం లేకుండానే జరగాల్సింది జరిగిందని చెప్పారు.
కాగా, నిన్నఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని సోమవారం శ్రీధర్ బాబు కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన లొంగలేదు. ‘200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కండువా కప్పడం అవసరమా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైంది? నా సీనియారీటి, సిన్సియార్టీకి ఇచ్చే విలువ ఇదేనా? కార్యకర్తల కష్టాలు, మనోభావాలు అక్కర్లేదా?’ అంటూ మంత్రి శ్రీధర్‌బాబు ఎదుట ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కినుక వహించిన జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తన ఇంటికి వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబుపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.ఈ క్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు రెండుసార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడండి అంటూ జీవన్‌రెడ్డిని కోరినా, ‘మాట్లాడను’ అంటూ తిరస్కరించినట్టు సమాచారం.