హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ) : మంత్రి పదవి ఆశించి భంగపడ్డ పలువురు సీనియర్ నేతలను బుజ్జగించేందుకు స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదని తెలుస్తున్నది. ఖర్గే చర్చలకు ఆహ్వానించినప్పటికీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఆది శ్రీనివాస్ వెళ్లకపోవడం, మరో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడం ఇటువంటి అభిప్రాయాన్నే కలగజేస్తున్నది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లోని తాజ్‌బంజారాలో పలువురు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని చర్చలకు ఆహ్వానించినట్టు తెలిసింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కూడా ఆహ్వానించినా, వారు భేటీని బహిష్కరించినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి.
గత ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలుగురు మంత్రులు ఉన్నారని, మన ప్రభుత్వంలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని, పార్టీలోనే సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరినట్టు తెలిసింది. సీనియర్ నేతగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని, కానీ కొన్ని సమీకరణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు సర్దుబాటు చేయలేకపోయామని ఖర్గే అన్నట్టు తెలిసింది. సామాజిక సమీకరణలే అడ్డంకి అయితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఏ సామాజికవర్గం నేతకైతే మీరు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారో.. ఆ సామాజికవర్గం నేతను తన స్థానంలో నిలబెడితే దగ్గరుండి గెలిపిస్తానని మల్రెడ్డి చెప్పినట్టు తెలిసింది. పది ఉమ్మడి జిల్లాలకూ మంత్రివర్గంలో స్థానం ఉండాలని సూచించినట్టు సమాచారం.
80% మంది ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకు వస్తే, పార్టీలో మాకు సరైన న్యాయం జరగలేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆయన మాటలు విన్న ఖర్గే త్వరలోనే సముచిత స్థానం లభిస్తుందనే హామీ ఇచ్చినట్టు బాలునాయక్ అనుచర వర్గం చెప్తున్నది. మరో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కూడా ఖర్గే మాట్లాడారు. త్వరలోనే మంచి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని మంత్రి కొండా సురేఖ దంపతులను మల్లికార్జునఖర్గే హెచ్చరించినట్టు తెలిసింది. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ముదిరి పాకానపడిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, ఎమ్మెల్యేలు కడియం, రేవూరి, నాయిని, ఎమ్మెల్సీ సారయ్య మరో వర్గంగా ఒకరిపై ఒకరు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఖర్గే కొండా దంపతులను పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. విభేదాలకు దారితీసిన విషయాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డానని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసి, అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశానని ఖర్గేకు ప్రేమ్‌సాగర్‌రావు వివరించినట్టు తెలిసింది. దీనిపై ఖర్గే స్పందిస్తూ.. తమ సేవలను పార్టీ గుర్తించిందని, వివిధ సమీకరణలతో మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామని, భవిష్యత్తులోనూ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. మంత్రి పదవికి బదులుగా చీఫ్ విప్ పదవిని తీసుకోవాలని ఖర్గే విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. దీంతో ‘మీకో దండం.. మీ రాజకీయాలకో దండం’ అంటూ ప్రేమ్‌సాగర్‌రావు భేటీ మధ్య నుంచి బయటికి వెళ్లిపోయినట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రేమ్‌సాగర్‌రావు వినకుండానే వెళ్లిపోయినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.