Rahul Gandhi | వరంగల్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆకస్మికంగా వరంగల్‌కు వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం కొన్ని గంటలపాటు హడావుడి చేశారు. ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమంలో పాల్గొనేది లేదంటూనే రాహుల్‌గాంధీ వరంగల్‌కు వస్తున్నారంటూ మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రాహుల్‌గాంధీ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 5.45 గంటలకు వరంగల్‌కు వచ్చి, 7.45 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో చైన్నైకి బయలుదేరుతారని అధికారికంగా షెడ్యూల్ వచ్చింది. రాహుల్‌గాంధీ పర్యటనలో భాగంగా వరంగల్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశమవుతారని, బీసీ రిజర్వేషన్ పెంపు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశాలపై ముఖ్యులతో మాట్లాడుతారని ప్రచారం జరిగింది.
అయితే, అధికారిక షెడ్యూల్లో ఏ ఒక్క కార్యక్రమం లేదని పేర్కొనడంతో సోషల్‌మీడియాలో ప్రచారానికి తెరపడింది. వరంగల్‌లో ఉండే రెండు గంటల్లో అర్ధగంట సేపు హెలిప్యాడ్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్‌కు, అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్తారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రాహుల్‌గాంధీని హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు కలుస్తారని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ హైదరాబాద్ నుంచి రాహుల్‌గాంధీతో వరంగల్‌కు వస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాజీపేట నుంచి చెన్నై వరకు రైలులో ప్రయాణించే సమయంలో కేంద్ర ప్రభుత్వం రైల్వేను ప్రైవేటీకరిస్తున్న అంశాలపై రాహుల్‌గాంధీ ప్రయాణికులతో మాట్లాడుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పార్లమెంటులో ముఖ్యమైన బిల్లులపై చర్చ కారణంగా రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటన రద్దయినట్టు అధికారులకు సమాచారం వచ్చింది.
రాహుల్‌గాంధీ ఆకస్మిక పర్యటన ఖరారు, రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే రాహుల్ పర్యటన రద్దయి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఇక్కడ రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ఇష్టం లేకనే రాహుల్‌గాంధీ ఆఖరి నిమిషయంలో తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారని, ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రత కారణాల రీత్యా రద్దు అయిందని ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.