హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఏడాదిన్నర రేవంత్‌రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధ. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసినా! సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నా!! జీహెచ్ఎంసీ.. హైడ్రా.. రెవెన్యూ.. ఇరిగేషన్.. తెల్లారకముందే ఏదో ఒక రూపంలో బుల్డోజర్ వస్తుంది. నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేసి ఆ కుటుంబాలను వీధినపడేస్తుంది. ఇదేమంటే… స్థానికులే ఫిర్యాదు చేశారని సమాధానాలొస్తాయి. మరి ఈ ఏడాది మార్చి 13న సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా ముందు ఒక ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో చెరువును ఆక్రమించి ఓ నిర్మాణ సంస్థ ఆకాశహార్మ్యాలు నిర్మిస్తున్నదని ఆరోపించారు. హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ ప్రాజెక్టు చేపట్టిన 27.18 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమి. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ ఆ సమయంలోనే అన్ని వివరాలతో గుట్టురట్టు చేసింది. ప్రభుత్వ పెద్దలు సహా అన్ని విభాగాలు ష్… గప్‌చుప్!!
సీన్ కట్ చేస్తే…
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. ఏకంగా హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఖాజాగూడ పరిధిలోని సర్వే నంబరు 27లో చెరువును కబ్జా చేయడంతోపాటు 27.18 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక నిర్మాణ సంస్థ అక్రమంగా బిల్డింగులు నిర్మిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఏడాదిన్నరగా నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు చెందిన వందల నిర్మాణాలను కూల్చివేసిన ప్రభుత్వ, అధికార యంత్రాంగం దాదాపు రూ.2వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటంలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ప్రజలకు చెందిన విలువైన భూములు, ఓ నీటి వనరును కాపాడటంతో సొంత ప్రభుత్వంలోనే న్యాయం దొరకడంలేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టు తలుపుతట్టారు. మరి… ‘కోర్టులో కేసు ఉంది’ అంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పే కథలాగే ఈ ఎపిసోడ్ కూడా అటకెక్కుతుందా? లేక ఏడాదిన్నరగా నిరుపేద, మధ్యతరగతి ప్రజలపై ప్రదర్శించిన బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది.
గత ప్రభుత్వం రద్దు చేసినా..
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, ఖాజాగూడ పరిధిలోని సర్వేనంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 27.18 ఎకరాల భూమిపై 80వ దశకం నుంచి న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్నది. 2022లో అప్పటి జిల్లా ఉన్నతాధికారి దానికి ఎన్వోసీ ఇవ్వడం.. దాని ఆధారంగా నిర్మాణ సంస్థ అక్కడ సుమారు 59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడు టవర్లను నిర్మించేందుకు అనుమతి తీసుకున్నది. అప్పటి ప్రభుత్వ పెద్దలు విషయం తెలుసుకొని ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. వాళ్ల ఆదేశానుసారం సీసీఎల్ఏ ఉన్నతాధికారి జిల్లా ఉన్నతాధికారి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతోపాటు ఎలాంటి అనుమతులు చెల్లవని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ భూమిలో సదరు సంస్థ వేసిన షెడ్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో 2023 డిసెంబరు వరకు ఆ ప్రభుత్వ భూమి సర్కారు ఆధీనంలోనే ఉంది.
కాంగ్రెస్ హయాంలో మొదలు..
గత ప్రభుత్వ హయాంలో సర్కారు ఆధీనంలోనే ఉన్న ఆ భూములు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు వశమయ్యాయి. ప్రభుత్వ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సదరు నిర్మాణ సంస్థ పక్కన ఉన్న చెరువు మీదా కన్నేసి అందులో మట్టి పోసింది. ఈ క్రమంలో ఏడాదిగా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు అంతస్తుల నిర్మాణం పూర్తయింది. ఖాజాగూడలో ఎకరా ధర కనీసం రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య ఉన్నది. అంటే 27.18 ఎకరాల భూమి విలువ రూ.2000 కోట్ల పైమాటే! రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్, చుట్టుపక్కల గత ఏడాదిన్నరగా సామాన్యుడు ఇంచు ప్రభుత్వ భూమిలోకి జరిగినా, గజం చెరువు బఫర్‌లో కలిసినా.. నిర్దాక్షిణ్యంగా నేలకూలుతున్నాయి. కానీ నెలల తరబడి ప్రభుత్వ, అధికార యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడ లేదు. దీంతో తెరవెనక పెద్దలెవరూ లేకుండా ఈ నిర్మాణాలు కొనసాగవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ఓ ప్రైవేటు సంస్థ పాగా వేసి దర్జాగా ఏడాది నుంచి భారీ నిర్మాణ ప్రాజెక్టును కొనసాగిస్తున్నదంటే తెర వెనక చక్రం తిప్పింది ఎవరు? అనేది తేలాలన్న డిమాండు వినిపిస్తున్నది.
కొనుగోలు చేసే సామాన్యుడి గతేంది?
ఏడాదిన్నరగా రాష్ట్రంలో రియల్-నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటూ ప్రభుత్వ పెద్దలు సర్దుబాటు ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇదే సర్కారు పెద్దల వైఖరి ఈ రంగంపై పిడుగుపాటుగా మారిందనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ మహా నగరంలో సుమారు రూ.15వేల కోట్ల విలువైన 11 భారీ నిర్మాణ ప్రాజెక్టులు అక్రమమని చెప్పారు. అప్పటికే వాటిలో వేల మంది సామాన్యులు లక్షలు వెచ్చించి ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఇంకా వేల సంఖ్యలో ఫ్లాట్లు అమ్ముడుపోవాల్సి ఉంది. ఇదేరీతిన ఏడాదిన్నర కిందట వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కండ్ల ముందే ఖాజాగూడ ప్రభుత్వ భూములు, చెరువులో ఆకాశహర్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. పైగా ఈ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇది అక్రమం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి.. ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేయాలా? వద్దా? కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నిరకాల అనుమతులు ఇచ్చిందన్న నమ్మకంతో కొనుగోలు చేసిన వారి భవిష్యత్తుకు ఎవరు పూచీ?