ఐనవోలు, జూన్ 3 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై సొంత పార్టీ నాయకులే వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును నిలదీశారు. అర్హులైన తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదంటూ మండిపడ్డారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ క్రమంలో అర్హులైన తమకు ఇళ్లు రాలేదంటూ ఎమ్మెల్యే నాగరాజును కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిలదీశారు. అర్హులకు కాకుండా పక్కా ఇళ్లు, భూములున్న వారి పేర్లు ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
బతుకుదెరువుకుపోతే లిస్టులో పేరు తీసేశారు
‘గ్రామంలో ఉండేందుకు మాకు ఇల్లు లేదు. బతుకుదెరువు కోసం కుటుంబసభ్యులందరం కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాం. మాకు సంబంధించిన అన్ని ఆధారాలు కక్కిరాలపల్లి ఊరు పేరు మీదే ఉన్నాయి. ఇక్కడ నివాసం ఉండడం లేదని, ఎవరో కావాలనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో నుంచి పేరు తీసేశారు’ అంటూ కక్కిరాలపల్లికి చెందిన తూళ్లు రజిత కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
– తూళ్ల రజిత, కక్కిరాలపల్లి, ఐనవోలు, హనుమకొండ జిల్లా