హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హేట్‌స్పీచ్ బిల్లుపై అధికారపక్ష సభ్యులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. భవిష్యత్తులో ఇది తమ మెడకే చుట్టుకుంటుందని ప్రభుత్వపెద్ద వద్ద కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లడం వెనుక ఆసక్తికర పరిణామాలు జరిగాయని ఆ రోజు సభలో ఉన్న ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.
సోషల్ మీడియా వేదికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రతరం అవుతుండడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతున్నదని అన్నారు. కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు వెనక్కి తగ్గడంలేదు. దీనికితోడు వారి పోస్టులపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులు వెలువరించాయి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా కట్టడికి కొత్త చట్టాన్ని తీసుకురావాలని సంకల్పించిన సర్కార్ హేట్‌స్పీచ్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లును బీజేపీ, సీపీఐ, ఎంఐఎం పార్టీలు సభలోనే తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు భావప్రకటనాస్వేచ్ఛకు గొడ్డలిపెట్టని విమర్శలు గుప్పించాయి. వీరితోపాటు బిల్లును చదివిన ఒరిజినల్ కాంగ్రెస్ సభ్యులు నిశ్చేష్టులైనట్టు తెలిసింది. ఇంతటి దారుణమైన నిబంధనలతో ఉన్న బిల్లు పాసై చట్టంగా రూపొందింతే కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఒక సీనియర్ మెంబర్ అయితే ‘మనం ఎప్పటికీ అధికారంలో ఉండం కదా.. రేపు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మనలాంటి వారి పరిస్థితి ఏంది.. ఈ చట్టం ద్వారా మనల్ని ఫుట్‌బాల్ ఆడుకొనే అవకాశం ఉంటుంది.. వెంటనే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించండి’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అటు ప్రతిపక్షం.. ఇటూ అధికారపక్షం నుంచి అభ్యంతరాలు వ్యక్తంకావడంతో కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడి దిక్కుతోచని స్థితిలో సెలెక్ట్ కమిటీకి పంపించినట్టు తెలుస్తున్నది.