హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్ కొండా సుస్మిత చేసిన బహిరంగ వ్యాఖ్యల వెనుక ఉన్న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. తన కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్న మంత్రి సురేఖ.. ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్ సీఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే సీఎల్పీ, పీసీసీ సమావేశాల్లో చర్చించుకోవాలని సూచించారు. సీఎంపై ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ సొంత పార్టీలో ఉండే నేతలు, సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ నేతలు అండగా ఉండాల్సింది పోయి ప్రతిపక్షాలకు సహకరించేలా విమర్శించడం సరికాదని విప్ బీర్ల అయిలయ్య పేరొన్నారు. చెట్టు కింద ఉండి చెట్టుకొమ్మనే నరుకొనే విధంగా కొండా సురేఖ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి వైఖరి ఉన్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆరోపించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం ఇచ్చినట్టవుతున్నదని చెప్పారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పడం ఆమోదయోగ్యం కాదని, సుస్మిత వ్యాఖ్యలతో సంబంధం లేకుంటే కొండా సురేఖ ఎందుకు ఖండించలేదని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రశ్నించారు. మంత్రి కుమార్తె వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం మూల్యం చెల్లిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం మూల్యం చెల్లిస్తుంటే, మీరు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై అనవసర ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం కోరారు. మంత్రి కొండా సురేఖ గతంలోనూ నోరుజారి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారని గుర్తు చేశారు. ఇలా మాట్లాడే వారిపై ఏఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. పార్టీకి తలవొప్పిగా మారిన వ్యక్తులను పదవుల నుంచి తప్పించాలని కోరారు. బజారుకు వచ్చి మాట్లాడటం కాంగ్రెస్ సంసృతి కాదని మండిపడ్డారు. సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సుస్మిత వ్యాఖ్యలను గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సీఎం,ప్రభుత్వాన్ని బలహీనపరిచే వారిపై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని విప్ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని స్పష్టంచేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించిన వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి సరిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కొండా సురేఖ భాగం, మరి ఆ నిర్ణయాలను ఆమె కుమార్తెనే విమర్శిస్తుంటే ఖండించరా? అని ప్రశ్నించారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించేలా ఉన్నాయని వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. విచ్చలవిడిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. నాలుగు పార్టీలు తిరిగొచ్చినోళ్లు తామే ఒరిజినల్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారు ఏ పార్టీలోనూ సక్రమంగా లేరని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్లోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారని గుర్తుచేశారు. సీఎంను తామే చేశామని తుపాకి రాముడిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మెజార్టీ వచ్చిందని, ఒక సురేఖ నియోజకవర్గంలోనే కాంగ్రెస్‌కు మెజార్టీ రాలేదని పేర్కొన్నారు. తమ పార్టీలోనే కొందరు గుంటనకలు ఉండి వీళ్లను నడిపిస్తున్నారన్న ఆయన మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ఎన్నికల సందర్భంలో కూడా ఒక నాయకుడు ‘నేను అంతా..ఇంతా’ అని మాట్లాడితే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ ముదిరాజ్ ఎద్దేవా చేశారు. సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ మనోహర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మధుసూదన్ కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, కూచుకుళ్ల రాకేశ్‌రెడ్డి, బాలూనాయక్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వంశీ కృష్ణ, వీర్లపల్లి శంకర్, వెడ్మ బొజ్జు, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేలు, కుందూరు జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు.
పిల్ల కాకి కొండా సుస్మిత వ్యాఖ్యలన్నీ ఆమెవి కాదని.. అవి కొండా సురేఖ మాటలేనని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విమర్శించారు. సుస్మిత ఇలాంటి మాటలు మాట్లాడటం ఇదే తొలిసారి కాదన్న ఆయన.. కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీనే ఖతం చేయాలని చూడటం సరికాదని హితవు పలికారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి మాటలు కూడా సరికాదని పేర్కొన్నారు. అటవీశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన శాఖపై ఎన్ని రివ్యూలు చేశారని ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఏఐసీసీ చర్యలు తీసుకోవాలని, బహిరంగంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోకుంటే పార్టీ నష్టపోతుందని స్పష్టంచేశారు. రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి వ్యాఖ్యలూ సరికాదని, అనవసరంగా మాట్లాడే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. హస్తం గుర్తుపై గెలిచి హస్తాన్ని నరుకుతామంంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.