కొత్తగూడెం, సెప్టెంబర్ 23: హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జన బందోబస్తు విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి జిల్లా కొత్తగూడెం టూటౌన్ ఎస్సై రోడ్డు ప్రమాదంలో మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూటౌన్ ఎస్సై కునుసోతు వెంకన్న (57) బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని బైకు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయన తలకు కుడివైపు రక్తస్రావమైంది. కుడి మోకాలికి, కుడిచేతికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన పెట్రో కార్-1 కానిస్టేబుల్ సూరిబాబు.. వెంటనే లక్డీకాపూలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి మెరుగ్గా ఉన్నదని భావించడంతో ఎస్సై వెంకన్నను స్వస్థలమైన హనుమకొండకు తరలించి మెడికవర్ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సాయంత్రం 5:40 గంటలకు మృతిచెందారు. ఘటనపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం, దానిని నడిపిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.