హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోడ్ ఉల్లంఘించారు. ఏకంగా పోలింగ్ బూత్‌ల వద్దే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ బూత్‌ల వద్ద తిరుగుతున్నారంటూ నాన్‌లోకల్ కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రధాన బూత్‌ల వద్ద పెద్దఎత్తున మోహరించి ఓటర్లను ప్రభావితం చేస్తున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పోలింగ్ బూత్‌ల వద్దే ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. రహమత్‌నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేశారు. సెయింట్ ఆల్ఫోన్సా హైస్కూల్లోని పోలింగ్ బూత్ నంబర్ 121 పక్కన ఉన్న ఇంట్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ సమావేశం ఏర్పాటుచేశారు. సిద్దార్థ్నగర్లోని పోలింగ్ బూత్ వద్ద ఓటర్లతో మాట్లాడారు. రామచంద్రనాయక్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర కార్యకర్తలు, ఓటర్లతో మాట్లాడుతూ కనిపించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థానికేతరులు తిరుగుతున్నారంటూ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ, డబ్బులు పంచుతూ, ఓటర్లను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.
యూసుఫ్‌గూడ మహ్మద్ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన కొందరిని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ పట్టుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆమె ఆందోళనకు దిగారు. సునీతకు మద్దతుగా అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నిబంధనలకు విరుద్ధంగా నాన్‌లోకల్ కాంగ్రెస్ నేతలు తిష్టవేసి ఓటర్లను ప్రభావితం చేశారని బీఆర్ఎస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. రెహమత్‌నగర్‌లోని కార్మికనగర్‌లో ఓ బూత్ వద్ద ఓటర్లకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు చీరలు పంచారు.