Vedma Bhojju | పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మరోసారి నిరసన సెగ తగిలింది. నిన్న నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రజలు నిలదీయగా.. ఇవాళ మంచిర్యాల జిల్లాలోనూ అదే సీన్ రిపీటయ్యింది.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సోమవారం నాడు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. ఓట్లు అడుగుతున్న సమయంలో గ్రామంలోని మహిళలు ఆయన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని.. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం ఎలా వచ్చారని నిలదీశారు. ఇలా మహిళలు ఒక్కొక్కరుగా ప్రశ్నలు సంధించడంతో సమాధానం చెప్పలేక.. ప్రచారం మధ్యలోనే ఆపేసి వెడ్మ బొజ్జు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు నిరసన సెగ
ఊరూరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తున్న ప్రజలు
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ… https://t.co/tzUNfahUP7 pic.twitter.com/aXZ3a86n11
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2025
నిర్మల్ జిల్లా పెంబిలో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా పోటీచేస్తున్న మల్లపెల్లి సత్యనారాయణస్వామి తరఫున ప్రచారం చేసేందుకు శనివారం ఎమ్మెల్యే బొజ్జు ఎస్సీకాలనీకి వెళ్లారు. ఓట్లు అడుగుతున్న సమయంలో పలువురు ఆయన్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరిచేశారు. ‘రెండేండ్ల పాలనలో మాకు ఏం మేలు చేశారు? రుణమాఫీ, రైతు భరోసా పేరిట మోసం చేశారు’ అంటూ పలువురు యువకులు, మహిళలు నిలదీశారు. కేవలం ఓట్ల సమయంలోనే వచ్చావని, ఇప్పటివరకు తమ కాలనీకి ఎందుకు రాలేదని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ తమకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
పింఛన్లు కూడా సక్కగ ఇస్తలేరని మహిళలు నిలదీయంతో ఎమ్మెల్యే బొజ్జు వారితో వాగ్వాదానికి దిగారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్లకు ఏమన్నా ఇచ్చిందా? అని ఎమ్మెల్యే అడుగగా అవును ‘టైంకు రైతుబంధు ఇచ్చిన్రు.. మీరు ఇచ్చిన్రా?’ అంటూ స్థానికులు ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ కొందరికే అయిందని వాపోయారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే.. ‘మీకు సహాయం చేసేందుకు నాకేమైనా తీటనా, నాకు క్రాస్ క్వశ్చన్లు వేయొద్దు’ అంటూ నోటిదురుసు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మాటలకు వెంట ఉన్న మద్దతుదారులు సైతం కంగుతిన్నారు. ఎమ్మెల్యే తీరుపై కాలనీవాసులు నిరసన తెలుపడంతో పరిస్థితి చేయిదాటుతున్నట్టు గమనించిన ఎమ్మెల్యే మద్దతుదారులు ఆయన్ను సముదాయించే ప్రయత్నంచేశారు. ప్రజలంతా కోపోద్రిక్తులవుతున్నట్టు గ్రహించి అక్కడినుంచి వెనుదిరిగారు. ఎమ్మెల్యే తమ సమస్యలను వినకుండా అసభ్య పదజాలంతో దూషించడమేమిటంటూ ప్రజలు బహిరంగంగానే నిరసన వ్యక్తంచేశారు. కాగా ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు స్థానికులు తమ సెల్ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.