మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 12 : ‘మీరు మాకు ఓట్లు వేయలేదు.. మా డబ్బులు ఇచ్చేయండి.. లేదా ప్రమాణం చేయం డి’ అంటూ మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా సోమ్లాతండాలో ఎమ్మెల్యే మురళీనాయక్ సోదరుడు శుక్రవారం తండావాసులతో గొడవకు దిగారు. సోమ్లాతండా ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామం. సర్పంచ్ అభ్యర్థిగా అన్న దల్సింగ్ భార్య భూక్యా కౌసల్యను కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున పోటీ చేయించారు. గురువారం ఫలితాల్లో స్వతంత్ర అభ్యర్థి ఇస్లావత్ సుజాత గెలుపొందగా, కౌసల్య ఓటమి పాలైంది. జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సోదరుడు దల్సింగ్ అతడి కుమారుడు సందీప్, మరికొందరు నాయకులు శుక్రవారం తండాలో హల్‌హల్ చేశారు. ‘మీరు మాకు ఓటు వేశారో లేదో ప్రమాణం చేయాలి’ అని దేవుడి జెండా పట్టుకొని తిరిగారు. లేదా డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవకు దిగారు. ‘ఓటు అనేది రహస్యం.
బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఓటు వేయాలని మీరే బతిమిలాడి డబ్బులు ఇచ్చారు. మేము డబ్బులు ఇవ్వాలని అడగలేదు’ అని తండావాసులు బదులిచ్చారు. తన సొంత వదిన సర్పంచ్‌గా ఓడిపోయిందని ఎమ్మెల్యే మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని తండాకు చెందిన తేజావత్ లచ్చు, గణేశ్, మంజుల, గంగ తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. వారి డబ్బులు వారికి తిరిగి ఇచ్చామని తెలిపారు. తండాలో వాటర్‌ట్యాంక్‌ను తామే కట్టించామని, ఇక్కడి నుంచి నీళ్లు తీసుకెళ్లొద్దని సదరు నాయకులు ప్లాంట్‌కు తాళం వేసుకొని వెళ్లారని స్థానికులు ఆవేదన చెందారు. ఓట్లు వేయలేదనే నెపంతో తండాలోని గుడిలో ఉంటున్న అయ్యప్ప స్వాములను సైతం నుంచి ఖాళీ చేయాలని ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. తండాలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు వచ్చి స్థానికులకు సర్దిచెప్పారు.