రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలురంగారెడ్డి, మార్చి 1 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గాంధీభవన్లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చే వారిని గౌరవించడం సబబే..కానీ పదవులివ్వొద్దంటూ ఆయన నేరుగా వ్యాఖ్యానించారు. అధికారంలో లేనప్పుడు కష్టపడిన నాయకులకు గుర్తింపునివ్వాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 41శాతం ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో చోటివ్వాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించాలని కోరా రు.
మంత్రివర్గంలో చోటివ్వడానికి సామాజికవర్గమే అడ్డు వస్తే బీసీలో ఏ నాయకుడి పేరు చెప్పినా ఇబ్రహీంపట్నం నుంచి గెలిపిస్తానని చెప్పారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఆరు మంత్రి పదవులు గ్రేటర్ పరిధిలోనే ఉండేవని గుర్తు చేశారు. ఇక పార్టీ లైన్ దాటొద్దని, కొన్ని విషయాలు బయటకు మాట్లాడటం లేదని ఆయన అనడం వెనుక ఏదో విషయమే ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇస్తేనే పార్టీ బలోపేతమౌతుందని, లేదంటే గ్రేటర్లో ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.