స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 30: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఎమ్మె ల్యే కడియం శ్రీహరి కోరారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూ రు కావడంతో మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా స్టేషన్ ఘనపూర్‌ను మునిసిపాలిటీ చేశానని, అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేసి తీసుకొచ్చానని తెలిపారు.
బీసీ రిజర్వేషన్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలపాలి
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ పంపించినట్టు కడియం శ్రీహరి తెలిపారు. బీసీలపై ప్రేమ ఒలకబోసే పార్టీలు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కడియం కోరారు. బీజేపీతోపాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని, ఎవరైనా కోర్టుకు వెళ్లినా కేసులు ఉపసంహరించుకోవాలని కోరారు.