డిచ్పల్లి, డిసెంబర్ 24: ‘ఖబర్దార్.. అల్లు అర్జున్. నువ్వు ఆంధ్రోడివి. బతకడానికి ఇక్కడికి వచ్చినవ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకో. లేకపోతే ఆంధ్రకు వెళ్లిపో’ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను అల్లు అర్జున్ వక్రీకరిస్తున్నాడని, ఇలాగే చేస్తే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వబోమని స్పష్టంచేశారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదు. హైదరాబాద్‌లో సినీ ఇండస్ట్రీకి స్థలాలిచ్చి, అన్ని ప్రోత్సాహకాలిచ్చింది. కానీ ఒక అమాయకురాలైన తల్లి చనిపోయి, ఆమె కొడుకు దవాఖానలో ఉంటే వాళ్లను ఎవరూ పలుకరించలేదు. కానీ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అందరూ పరామర్శిస్తుండ్రు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాబట్టి ఏ11గా పెట్టింది. దాన్ని వక్రీకరించి ముఖ్యమంత్రి మీద ఏదో మాట్లాడుతుండు. అల్లు అర్జున్ జాగ్రత్త. నువ్వు పగటి వేషగాడివి. వేషాలు వేసుకుని బతికేవాడివి. చెత్త సినిమా తీసినవ్. అదో స్మగ్లర్ సినిమా. సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని పుష్ప సినిమా తీసినవ్. అది సమాజాన్ని బాగుపరిచే సినిమానా? నువ్వు ఆంధ్రోడివి. ఆంధ్రోడిగా బతకడానికి వచ్చావ్.
పగటి వేషాలు వేసుకుని బతికే నువ్వు.. హీరోవని గౌరవం ఇస్తున్నాం. దాన్ని కాపాడుకో. డబ్బులు ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకుని సంపాదించే నువ్వు సమాజానికి ఏం చేశావ్? తెలంగాణకు నీ కంట్రిబ్యూషన్ ఏముంది? చనిపోయిన వ్యక్తిని పరామర్శించలేని నీది ఏం మానవత్వం? మొన్న జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్లు ఇంటి దగ్గర ఆందోళన చేసిండ్రు. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా చెబుతున్నా.. మరోసారి ఇట్లనే మాట్లాడితే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వం. ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట సందర్భంగా ఏం జరిగిందో మా ముఖ్యమంత్రి మొత్తం చెప్పలేదు. తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయింది. మీరు వెళ్లిపోవాలని ఏసీపీ చెబితే.. నరబలి అయిపోయింది. సినిమా సూపర్ హిట్ అవుతుందని అంటావా? నీవు మనిషివేనా? మానవత్వం ఉందా? డీసీపీ పోయి వెళ్తావా? అరెస్టు చేయమంటావా? అంటే అప్పుడు బయటకు వస్తావా? ఏదో ఘనకార్యం చేసినట్టు పోయేటప్పుడు కూడా చేతులు ఊపుకుంట పోతవా? మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. అవసరమైతే కాంగ్రెస్ శ్రేణులు అల్లు అర్జున్ సినిమాలను తెలంగాణలో ఆడనీయం. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే చేసుకో. లేకపోతే ఆంధ్రకు వెళ్లిపో’ అని ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యానించారు.