Congress MLA | హైదరాబాద్ : యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అది కూడా అర్ధరాత్రి వేళ వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాల వద్దకు చేరుకుని యూరియా కోసం లైన్లు కడుతున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మద్దతుదారులు విచ్చలవిడిగా యూరియాను బ్లాక్‌లో విక్రయిస్తూ దందాలకు పాల్పడుతున్నారు.
తాజాగా మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్.. రైతులకు ఇవ్వాల్సిన యూరియాను బ్లాక్‌లో అమ్మి అడ్డంగా దొరికిపోయాడు. లారీ యూరియా లోడ్‌ను గన్‌మెన్ నాగు నాయక్ బ్లాక్‌లో అమ్మేసినట్లు తేలింది. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పీఏను అంటూ గన్‌మెన్ పరిచయం చేసుకుని లారీ లోడ్ యూరియాను డైవర్ట్ చేశాడు. మాకు యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు యూరియా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గన్‌మెన్‌పై విచారణకు ఆదేశించారు.