నవాబ్‌పేట, నవంబర్ 12 : ‘సారూ.. మా ఊర్లో యాసంగి వరి పంట బోనస్ ఇప్పటికీ చాలా మందికి రాలేదు.. ఇప్పుడు మళ్లీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు.. మళ్లీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయిస్తే మా పరిస్థితి ఏమిటి’? అంటూ ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్త నిలదీశాడు. బుధవారం నవాబ్‌పేట మండలం లింగంపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వచ్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న లింగంపల్లికి చెందిన రైతు, కాంగ్రెస్ కార్యకర్త కొంగళ్ల రాజు స్పందిస్తూ.. యాసంగిలో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించారని తెలిపారు. వారికి నేటికీ బోనస్ డబ్బులు అందలేదని గుర్తుచేశారు.
మళ్లీ ఇప్పడు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడే ధాన్యం విక్రయించాలని చెప్పడంపై పలువురు రైతులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే కల్పించుకొని చాలా మందికి బోనస్ వేశాం.. ఇంకా ఎవరికైనా రాకుంటే చెప్పాలి.. కానీ అనవసరంగా ఇక్కడ మాట్లాడవద్దని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏవో కృష్ణకుమార్‌ను పిలిచి ఇంకా ఎంతమంది రైతులకు బోనస్ రాలేదని అడిగారు. బోనస్ తమ పరిధిలో ఉండదని, పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంటుందని ఏవో చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారు తప్పించుకుంటే ఎలా? అంటూ నిలదీశారు. చివరకు కేంద్రాన్ని ప్రారంభించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై ఏవో కృష్ణకిశోర్‌ను వివరణ కోరగా.. గ్రామంలో ఇంకా చాలా మందికి బోనస్ డబ్బులు అందాల్సి ఉందని తెలిపారు.