హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఖాజాగూడ ప్రభుత్వ భూముల్లో ఓ రియల్ సంస్థ నిర్మాణాల విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో రాజీపడే ప్రసక్తేలేదని, ఎంతవరకైనా పోరాడుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి సైతం చెప్పినట్టు తెలిపారు.
అసెంబ్లీ లాబీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ భూ వివాదాన్ని వదిలేయాలని సీఎం చెప్పారని, కానీ తాను మాత్రం వదిలిపెట్టబోనని స్పష్టం చేశానని వెల్లడించారు. రెవెన్యూశాఖ నుంచి తాను కోరిన సమాచారం ఇవ్వకుండా మంత్రి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు తానే పెద్ద ప్రతిపక్షమంటూ అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖాజాగూడలో ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి వంశీరామ్ బిల్డర్స్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.