Medigadda Barrage | హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : మేడిగడ్డ బరాజ్ పనికిరాదంటూ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ప్రచారం అంతా వట్టిదేనని తేలిపోయింది. ఎన్డీఎస్ఏ నివేదిక సాకుతో కాలయాపన చేస్తున్నదని స్పష్టంగా రూఢీ అవుతున్నది. తాజాగా కాళేశ్వరం కమిషన్ ఎదుట బరాజ్ నిర్మాణ సంస్థ అయిన ఎల్అండ్టీ ప్రతినిధులు నివేదించిన అంశాలే అందుకు రుజువు. బరాజ్‌ను పునరుద్ధరించి వినియోగించుకోవచ్చని ఎల్అండ్టీ ప్రతినిధులు వెల్లడించడంతో బరాజ్‌పై ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా బూటకమని తేలిపోయింది. జస్టిస్ పీసీ ఘోష్ శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు ఎల్అండ్టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణరాజు, సంస్థ టన్నెల్స్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ సురేశ్ కుమార్, సంస్థ మాజీ డీజీఎం రజనీశ్ హాన్ హాజరయ్యారు.
మేడిగడ్డ బరాజ్ నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై వారిని ఘోష్ ప్రశ్నించారు. డిజైన్లు, డ్రాయింగ్‌తోపాటు భారీ వరదలతో బరాజ్ డ్యామేజీ అయిందని ఎల్అండ్టీ ప్రతినిధులు వెల్లడించారు. వెంటనే మోడల్ స్టడీస్ మళ్లీ చేయాలని, మొదట్లోనే సమస్య పరిషరిస్తే ఇంతటి డ్యామేజీ అయ్యేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కుంగుబాటుకు గల కారణాలపై తామూ అధ్యయనం చేశామని, ప్రభుత్వానికి ఆ నివేదిక ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్లాక్ 7ను పునరుద్ధించవచ్చని, బరాజ్‌ను తిరిగి వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. డిజైన్ లోపాలున్నాయని ఐఐటీ రూరీ స్టడీలో తేలిందని, ఆ రిపోర్టుని ఇరిగేషన్, ఎన్డీఎస్ఏకి పంపినట్టు తెలిపారు. ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు ప్రస్తుతం తాతాలిక చర్యలే చేపట్టామని వివరించారు.
లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ)లోని 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ 2023 అక్టోబర్‌లో కుంగుబాటుకు గురైన విషయం తెలిసిందే. ఇదే అదనుగా ప్రాజెక్టుపై అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నది. సమగ్ర విచారణ చేయకముందే డిజైన్, నాణ్యతా లోపాలపై ఆరోపణలు చేసింది. మంత్రులు ఒకసారి, ముఖ్యమంత్రి మరోసారి ప్రాజెక్టును స్వయంగా సందర్శించి అక్కడా అవే ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు, ఒకవైపు విజిలెన్స్ విచారణకు, మరోవైపు జ్యూడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించింది.
ప్రాజెక్టు పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ఎన్డీఎస్ఏ దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరమే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను చేపడతామంటూ మీనమేషాలు లెక్కిస్తున్నది. ఏడాదికిపైగా గడిచినా పునరుద్ధరణపై మా త్రం వారు స్పందించడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఎస్ఏ నివేదికను తెప్పించుకునే ప్రయత్నమూ చేయని దుస్థితి నెలకొన్నది. అయితే ఎల్అండ్టీ ప్రతినిధులు వెల్లడించిన అంశాల మేరకు బరాజ్ పునరుద్ధరణకు అవకాశాలున్నా కాంగ్రెస్ చొరవ చూ పడం లేదని తేటతెల్లమవుతున్నది.