హైదరాబాద్, ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైనట్టు తెలిసింది.
ఈ క్రమంలో వారికి ఈసారి టికెట్లు ఇవ్వకూడదని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలువడం కష్టమన్న అభిప్రాయానికి పార్టీ అధిష్ఠానం వచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. టికెట్ నిరాకరిస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో బఘేల్ విశ్వాసపాత్రులు కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో అధిష్ఠానంతో చర్చలు జరుపడానికి సీఎం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 25 మంది సిట్టింగ్లకు టికెట్ నిరాకరిస్తే, మూడింట ఒకవంతు కంటే ఎక్కువ మందిని మారుస్తున్నట్టు లెక్క.