హైదరాబాద్: అలవికానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసింది. ఓవైపు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. విత్తనాలు దొరక్క రైతులు అవస్తలు పడుతున్నారు. విత్తనాల కోసం పదేండ్ల క్రితం చూసిన దృష్యాలు మళ్లీ పునరావృతమవుతున్నాయి. ఫర్టిలైజర్ షాపుల ముందు పెద్దపెద్ద క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రజాసమస్యలను పక్కనపెట్టిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వంలో తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నది. ఇప్పటివరకు లోగోలో (Telangana Emblem) ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
పలు రకాల లోగోలు డిజైన్ చేయగా.. రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ అమరవీరుల స్తూపం, కాంగ్రెస్ పతాకంలోని రంగులకు చోటు లభించినట్లు తెలుస్తున్నది. ఈ లోగోను దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు రాజకీయ పార్టీల నేతలతో భేటీ తర్వాత రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసే అవకాశం ఉన్నది.