హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీలో కాంగ్రెస్ మార్క్ మాయాజాలం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి రైతులకు మాఫీ చేసే రుణ మొత్తం పెరిగితే అర్హుల సంఖ్య కూడా పెరగాలి. కానీ, కాంగ్రెస్ మార్క్ రుణమాఫీలో అర్హుల సంఖ్య భారీగా తగ్గుతున్నది. బీఆర్ఎస్ హయాంలో చేసిన రుణమాఫీకి అర్హులైన రైతులతో పోల్చితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
బీఆర్ఎస్ సర్కారు 2018లో రూ.లక్ష వరకు రుణమాఫీకి 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా తేల్చింది. ఇప్పుడు కాం గ్రెస్ సర్కారు రూ.2 లక్షల వరకు రుణమాఫీకి మూడు విడతల్లో కలిపి సుమారు 23.75 లక్షల మంది రైతులకు మాత్రమే వర్తింపజేస్తున్నది. బీఆర్ఎస్ హయాం కంటే కాంగ్రెస్ ఏలుబడిలో రుణమాఫీ పొందే రైతుల సంఖ్య 12.93 లక్షలు తగ్గింది! దీంతో రుణమాఫీపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమకు రుణమాఫీ అవుతుందో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
2 లక్షల రుణమాఫీ 6 లక్షల మందికే…
తొలి రెండు విడతల రుణమాఫీలో అర్హుల సంఖ్యలో భారీగా కోత పడటంతో కనీసం చివరిదైన మూడో విడతలోనైనా తమకు న్యాయం జరుగుతుందేమోనని రైతులు ఆశపడ్డారు. కానీ, మూడో విడతలోనూ భారీ కోతలకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్టు అర్థమవుతున్నది.
ఈ విడతలో ఆరు లక్షల మంది రైతులను మాత్రమే అర్హులుగా తేల్చారు. వీరికి రూ.ఆరు వేల కోట్లను మాఫీ చేయనున్నారు. దీంతో ఈ విడతలోనూ చాలామంది రైతులకు మొండిచెయ్యి ఎదురవుతున్నది. ఈ విడతతో రుణమాఫీ పూర్తవుతుందా? మిగిలిపోయిన రైతులకు మరో విడత అమలు చేస్తారా? అనేదానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఈ విడతలో రుణమాఫీ పొందనివారి పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది.
మాఫీ 24 లక్షల మందికే!
రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న రైతులు 70 లక్షల మంది ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఈ లెక్కన కాస్త అటూ ఇటూగా 70 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ, మూడు విడతల్లో కలిపి ప్రభుత్వం సుమారు 24 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నది. ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తొలి విడతలో జూలై 18న రూ.లక్ష వరకు రుణాలు ఉన్నవారిలో 11.34 లక్షల మందికి మాత్రమే రూ.6,034.96 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
జూలై 30న రెండో విడతలో రూ.1.5 లక్షల వరకు రుణం ఉన్నవారిలో 6.40 లక్షల మందికి మాత్రమే రూ.6,190 కోట్లు మాఫీ చేసింది. మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల వరకు రుణాలను ఈ నెల 15న మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సుమారు ఆరు లక్షల మంది రైతులకు చెందిన రూ.ఆరు వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ లెక్కన మూడు విడతల్లో కలిపి రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు మాత్రమే. దీంతో దాదాపు 46.25 లక్షల రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారు.
పోనీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్క ప్రకారం రుణం తీసుకున్న రైతుల సంఖ్య 44 లక్షలు అనుకున్నా ప్రభుత్వం 20.25 లక్షల మంది రైతులను రుణమాఫీకి దూరం చేస్తున్నదనే విమర్శలున్నాయి. వాస్తవానికి 2018తో పోల్చితే ప్రస్తుతం రైతుల సంఖ్య భారీగా పెరిగింది. రైతుబంధు లెక్కల ప్రకారం 2018లో కేవలం 50 లక్షల మంది రైతులు ఉండగా ఇప్పు డు ఈ సంఖ్య 70 లక్షలకు చేరింది. అయినప్పటికీ రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
31వేల కోట్లకు చేసేది 18 వేల కోట్లే!
వాస్తవానికి రూ.2 లక్షల రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం తొలుత తెలిపింది. కానీ, రూ.18 వేల కోట్లతో రుణమాఫీ కథ ముగించేలా కనిపిస్తున్నది. ప్రభుత్వం చెప్పిన రూ.31 వేల కోట్లతో పోల్చితే రూ.12,775 కోట్లు తగ్గడం గమనార్హం. ఈ మేరకు రైతులకు నష్టం జరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రుణమాఫీ కింద రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కాంగ్రెస్ ఇస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. బీఆర్ఎస్ సర్కారు చేసిన రూ.లక్ష రుణమాఫీతో పోల్చితే కాంగ్రెస్ సర్కార్ రూ.2 లక్షల రుణమాఫీకి రూ.919 కోట్లు తక్కువగా ఖర్చు చేస్తుండటం గమనార్హం. కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీలో అడ్డగోలు కోతలు పెట్టి, లక్షల మంది రైతులను అనర్హులుగా తేల్చి, వారి కడుపులు కొట్టిందనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.
నేడు 2 లక్షల వరకు రుణమాఫీ
ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.5 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం గురువారం రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనున్నది. రూ.2 లక్షల వరకు రుణమాఫీలో భాగంగా సుమారు ఆరు లక్షల మంది రైతులకు చెందిన రూ.6 వేల కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.