గద్వాల, నవంబర్ 21 : ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ వర్గాల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. తామంటే తామే కొనుగోలు చేస్తామంటూ కాంగ్రెస్‌కు చెందిన ఇరువర్గాల మహిళా గ్రూపులు బాహాబాహీకి దిగాయి. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బీరెళ్లి గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వర్గానికి చెందిన పూజిత, గాంధీ, ఇతర మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అనుమతులిచ్చారు.
ఈ క్రమంలో గురువారం కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో తమకు అనుమతులిచ్చారని.. తామే కొనుగోలు చేస్తామని జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గమైన నెహ్రూ, మథర్ థెరిస్సా, వెలుగు సంఘాల వారు ఎమ్మెల్యే వర్గంతో వాదనకు దిగారు. దీంతో తోపులాటలు జరగ్గా.. ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. కేంద్రాన్ని ప్రారంభించకుండా కాంటాను ఎత్తుకెళ్లారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని తోపులాటను నిలువరించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం వాయిదాపడటంతో ధాన్యం అక్కడే ఉంచాల్సిన పరిస్థితి నెలకొన్నది. అనంతరం ఇరువర్గాలు ఒకరిపైఒకరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్టు తెలిసింది. ఘర్షణ పడిన విషయం తమ దృష్టికి రాలేదని డీపీఎం రామ్మూర్తి తెలిపారు.
సంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ నేతల పంచాయితీ గాంధీభవన్‌కు చేరింది. కాంగ్రెస్‌లో ముఖ్యనేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన కాటా శ్రీనివాస్‌గౌడ్, ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన నీలం మధు వర్గాలు నియోజకవర్గంలో పెత్తనం కోసం పోటీపడుతున్నారు. సంగారెడ్డిలో ఇటీవల జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ హాజరైనా ముగ్గురు నాయకులు డుమ్మా కొట్టారు. కాటా అనుచరులతో కలిసి గాంధీభవన్ ఎదుట నిరసనకు దిగారు. పటాన్చెరులో పార్టీ కోసం పనిచేస్తున్న కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయ ం చేయాలంటూ కార్యకర్తలు నినదించా రు. కాటా ఉపముఖ్యమంత్రి భట్టి, పీసీసీ చీఫ్‌ను కలిసి పటాన్చెరులో పార్టీ పరిస్థితి వివరించి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.