వనపర్తి, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతారా? అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మట్టిని, కష్టాన్ని నమ్ముకుని సేద్యం చేస్తున్న కర్షకులకు సీఎం కేసీఆర్ రైతుబంధు అమలు చేస్తున్నారని, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఈ పథకం ఆగదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారని విమర్శించారు. రైతుకు మేలు చేస్తున్న పథకం ఆపాలని హస్తం పార్టీ ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రపంచంలోనే ఎంతో ఆదరణ పొందాయని యూఎన్వో అనే సంస్థ నిర్ధారించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతటి పథకాన్ని అడ్డుకోవాలని చూస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలపై కాంగ్రెస్‌కు ఏనాడూ ప్రేమ లేదని, ఎన్నికలు రావడంతో ఇప్పుడు లేనిపోని ప్రేమను ఒలకబోస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వచ్చే యాసంగిలో రైతుబంధు పడుతుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 11 విడుతల్లో రూ.72,815 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఎన్నికలొస్తే ధాన్యం కొనుగోళ్లను సైతం కాంగ్రెస్ నిలిపివేయాలని కోరుతుందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.కర్ణాటకలో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోస పెడుతున్నదని, ఈ విషయాన్ని అక్కడి రైతులే స్వయంగా వెల్లడిస్తున్నారని చెప్పారు. రైతులను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.