ఉమ్మడి నల్లగొండలో అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీయే అధికారంలోకి వస్తున్నది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఈ ఎన్నికల్లో జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్కటి మినహా కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని స్థానాల్లో జెండా ఎగురవేసింది. దీంతో రాష్ట్రంలో కూడా ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది.
2014లో జరిగిన ఎన్నికల్లో ఏడు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించగా, 2018 ఎన్నికల్లో మునుగోడు మినహా అన్ని స్థానాల్లో కారు దూసుకుపోయింది. దీంతో తెలంగాణలో వరుసగా రెండుసార్లు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో సూర్యాపేటలో తప్ప మిగిలిన అన్ని చోట్ల బీఆర్ఎస్ పరాజయం పాలవడంతో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడం గమనార్హం.