Congress | హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు కూల్చివేతల పర్వానికి తెరలేపింది? ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నది? డైవర్షన్ టాక్టిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ముఖ్యులు ఈ కూల్చివేతలను మొదలుపెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రధానంగా రెండు రకాల డైవర్షన్ల గురించి వారు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒకటి.. రాష్ట్రంలో కొంతకాలంగా ప్రజాపరిపాలన స్తంభించిందంటూ, గ్రాఫ్ పడిపోతున్నదంటూ వార్తలు వెలువడ్డాయి. దానికి బలాన్ని చేకూరుస్తూ నిరుద్యోగుల ఆందోళన, రుణమాఫీ గొడవ.. రోజూ ఏదో ఒక వర్గం రోడ్డుమీదికి వస్తున్నది. నిరసనలు నిత్యకృత్యమైన ఈ దశలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ నాయకత్వం కూల్చివేతల ఎత్తుగడను ఎంచుకున్నారనేది రాజకీయ వర్గాలు చెప్తున్నమాట. ఇది కేవలం ప్రజల దృష్టిమళ్లించేందుకే కాదని, దీని వెనుక మరో డైవర్షన్ కూడా ఉన్నదని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.. అదే ‘మహారాష్ట్ర ఎన్నికలు’! త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
హర్యానా, కశ్మీర్ తర్వాత నవంబర్‌లో మహారాష్ట్ర ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ దశలో మహారాష్ట్రలో గెలుపు కాంగ్రెస్ అధినాయకత్వానికి అత్యవసరం. అందుకు ఆ పార్టీకి భారీ ఫండింగ్ అవసరం. ప్రస్తుతం రెండు పెద్ద రాష్ర్టాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఒకటి కర్ణాటక కాగా.. మరొకటి తెలంగాణ. రెండూ ఆర్థికంగా, రాజకీయంగా బలమైనవి. పాలనాపరంగా కర్ణాటకలో ఇప్పటికే దివాలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, చార్జీల మోత, పెరుగుతున్న ప్రజావ్యతిరేకత, అవినీతిలో ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన సీఎం సిద్ధరామయ్య! ముఖ్యమంత్రి ఎప్పుడు మారుతారో తెలియని సందిగ్ధ స్థితి! దీంతో కర్ణాటక నుంచి నిధుల సమీకరణ సాధ్యమయ్యేలా కాంగ్రెస్ అధిష్ఠానానికి కనిపించడంలేదని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చును భరించాల్సిన భారమంతా తెలంగాణపైనే పడిందని అవి భావిస్తున్నాయి. ఈ మేరకు పార్టీ ఫండ్‌కు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి భారీ టార్గెట్‌ను ఇవ్వడంతోపాటు.. సమకూర్చాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నదని పార్టీవర్గాలే చర్చించుకుంటున్నాయి.
ప్రముఖులపై ఒత్తిడి!
తెలంగాణలోనూ పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా ఏమీ లేదు. రియల్ఎస్టేట్ రంగం పడిపోయింది. దాని అనుబంధ రంగాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నగదు చెలామణి తగ్గిపోయింది. పారిశ్రామిక రంగాల్లో నిస్తేజం అలుముకున్నది. దీంతో ఆర్థిక వనరులను సమకూర్చుకునే అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం అక్రమ కట్టడాల కూల్చివేతకు తెరలేపిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో తమకు భారీగా సపోర్ట్ చేయాల్సిందిగా ఒకరిద్దరు ప్రముఖులపై నాయకులు ఒత్తిడి తెచ్చారని.. వారు కాదనడంతోనే కూల్చివేతల అంకానికి సిద్ధమయ్యారని నేతల చర్చల్లో వినిపిస్తున్న మాట. ఒకరిద్దరు గట్టోళ్లను కొడితేనే మిగిలిన పని సునాయాసంగా అయిపోతుందని ఈ నిర్ణయానికి వచ్చినట్టు వారు చెప్తున్నారు. ఇందుకోసం డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, విపక్ష ప్రముఖులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్వామికార్యం.. స్వకార్యం!
స్వామికార్యంతోపాటు స్వకార్యం కూడా సాధించుకునేందుకు కూల్చివేతలను ఎంచుకున్నట్టు అధికారపార్టీలోని కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారు. ‘పార్టీలో తనకు ప్రత్యర్థులుగా ఉన్న నాయకులను లక్ష్యం చేసుకోవడానికీ ఈ కూల్చివేతలను ఓ ముఖ్యనేత వాడుకుంటున్నారు. పార్టీలో తానే సుప్రీం అని, తనను కాదని ఎవరూ ఏమీ చేయలేరనే సంకేతాలు ఇవ్వడమే ఆయన ఉద్దేశం. ఆర్థిక వనరుల సమీకరణ తనతోమాత్రమే సాధ్యమని అటు అధిష్ఠానానికి తెలియజెప్పడంతోపాటు.. కూల్చివేతల బూచి చూపి అక్రమ నిర్మాణాలు కలిగిన పార్టీలోని తన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపడం ఆ వ్యూహంలో భాగమే’ అని కాంగ్రెస్ పరిణామాలను దగ్గరినుంచి గమనించే సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు చెప్పారు. హైడ్రా వ్యవహారంలో టార్గెట్ అయిన నేతల్లో ఒకరు పొంగులేటి కాగా, మరొకరు వివేక్! ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు కావడం, ఢిల్లీ నాయకత్వాన్ని ప్రభావితం చేయగలిగి ఉండటంతో వారిని అక్రమ నిర్మాణాల వివాదంలోకి లాగి ఉంటారన్నది సదరు విశ్లేషకుడి మాట.
అనుకూలమైన అధికారులకు చోటు!
హైడ్రా రాత్రికిరాత్రి వచ్చింది కాదని, కొంతకాలంగా దానికి రంగం సిద్ధంచేశారని స్వతంత్ర జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. ‘రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో తనకు విశ్వసనీయులైన, తన మాట చెల్లుబాటు చేసే అధికారులను ముఖ్యనేత ఒకరు కొంతకాలంగా నియమిస్తూ వచ్చారు. కూల్చివేతల పర్వం మొదలైతే.. అది తన అదుపాజ్ఞల్లో అధికారులు నడుపాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు’ అని ఆ పాత్రికేయుడు పేర్కొన్నారు.
అప్పులపై బీద అరుపులు అందుకేనా?
‘కేంద్రంలో అధికారం లేనప్పుడు.. అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తమ ప్రభుత్వాల నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం ఆశిస్తుందో అందరికీ తెలుసు. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉన్నది కనుకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యులు తెలంగాణ అప్పుల్లో ఉన్నదని పదే పదే మాట్లాడారు. రాష్ట్రం పరువు పోయినా సరే.. అన్న రీతిలో వాళ్ల వ్యాఖ్యానాలు సాగాయి. నిజానికి వాళ్ల ఉద్దేశం తెలంగాణ అప్పుల్లో ఉన్నదని చాటిచెప్పడం కాదు.. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై పెట్టుకున్న అంచనాలను తగ్గించడం. అంత ఇచ్చుకోలేమని చెప్పుకోవడం. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఆర్థిక వనరుల సమీకరణకు తెలంగాణ తప్ప దానికి మరో దారి లేదు’ అని కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.