నల్లబెల్లి, జూన్ 11: బోరు వాహనాల కమీషన్ ఇవ్వకపోవడంతో కొందరు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా బీఆర్ఎస్ నేత బైక్‌ను లాక్కెళ్లిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేసిన భూములకు విద్యుత్తు సరఫరా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.700 కోట్లు మంజూరు చేసింది. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఉపసర్పంచ్ గాదం సంధ్య భర్త రాజ్‌కుమార్ తన బోరు వాహనంతో పట్టాలు కలిగిన పోడు భూముల్లో బోర్లు వేశాడు.
తమ పార్టీ ఎమ్మెల్యే అనుమతితో బోర్లు వేస్తున్నాడనే సాకుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మేడేపల్లి ఉపసర్పంచ్ భర్త మోహన్నాయక్తోపాటు అదే పార్టీకి చెందిన వంగర వెంకన్న, ఆవుల ఐలయ్య, జనగాం రాజు, అక్కపెల్లి రమేశ్ బోరు బండి నడిపినందుకు తమకు కమీషన్ కింద రూ.28 వేలు ఇవ్వాలని రాజ్‌కుమార్‌ను వేధించారు. ఆ కమీషన్ ఇవ్వడం లేదని ఆయన బైక్‌ను బలవంతంగా లాక్కెళ్లారు. ఇప్పటికైనా కమీషన్ ఇవ్వకుంటే ఫారెస్ట్ అధికారులతో తన బోరు వాహనాన్ని సీజ్ చేయిస్తామని బెదిరిస్తున్నారని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.