రామగిరి, మే 21: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు విధ్వంసానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. మంగళవారం రామగిరి మండలం నాగేపల్లిలోని సులభ్ కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంథని – పెద్దపల్లి ప్రధాన రహదారిలో నాగేపల్లి ఎక్స్‌రోడ్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించారు. భవన శిలాఫలకంపై అప్పటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండటంతో వారి ఆనవాళ్లు ఉండొద్దనే ఒకే ఒక్క కారణంతో కక్షగట్టి మంగళవారం సులభ్ కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. ఇదొక్కటే కాదని గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఇలాగే ధ్వంసం చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని, అడిగేవారు లేరని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేయాల్సిన అధికార పార్టీ నాయకులు, ఇలా విధ్వంసానికి పాల్పడుతూ సంబురాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి సులభ్ కాంప్లెక్స్‌ను కూల్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.