Urea | కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /రుద్రంగి : యూరియా కొరత లేదంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రకటించిన 24 గంటల్లోనే అదే యూరియా కోసం అదే గ్రామంలో రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా తీసుకెళ్లడానికి ఇబ్బందులుపడ్డారు. విప్ స్వగ్రామం రుద్రంగితోపాటు వేములవాడ నియోజకవర్గంలో యూరియా కొరత లేదని చెప్పిన 24 గంటల్లోనే.. రెండు కేంద్రాల పరిధిలో పెద్దసంఖ్యలో రైతులు పడిగాపులుకాశారు. ఇది అధికార పార్టీ అబద్ధాలకు నిలువుటద్దంలా నిలిచింది. ఇన్నాళ్లు మీడియా వక్రీకరణ అంటూ చెప్పుకొచ్చిన ఆ పార్టీ నాయకులు.. ఇప్పుడు మాత్రం ఏమీ చెప్పలేక సతమతమవుతున్నారు.
ప్రభుత్వ విప్ స్వగ్రామమైన రుద్రంగి గ్రామ పరిధిలోని ఆగ్రో సేవా కేంద్రం వద్ద ఈ నెల 8న రాత్రి పూట యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడిన వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన రైతు లక్కం నర్సయ్య, మహిళా రైతు లావుడ్యా లలిత ఎరువుల పంపిణీ తీరు, ఎదురైనా ఇబ్బందులను అక్కడే ఉన్న రైతుల సాక్షిగా ఎండగట్టిన విషయం మీడియాలో వచ్చింది. అలాగే సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ నాయకులు, ఆగమేఘాల మీద ఈనెల 9న సదరు ఇద్దరు రైతులను పిలిపించి వాయిస్ రికార్డు చేసి మీడియాకు విడుదల చేశారు. రుద్రంగిలో యూరియా కొరత లేదని, మీడియా వాళ్లే తమతో అబద్ధాలు మాట్లాడించారంటూ చెప్పించారు. ఇక్కడితో ఆగకుండా, లక్కం నర్సయ్య అనే రైతు మాట్లాడుతూ.. తాను ఏమైన తప్పువొప్పులు మాట్లాడి ఉంటే సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రైతు సారీ చెప్పే స్థాయి వరకు వచ్చిన పరిస్థితులను, అందుకు సంబంధించిన విషయాలను ఎండగడుతూ ‘ఎరువులు అడిగినందుకు కాంగ్రెస్ సవారీ.. రైతులతో సారీ’ శీర్షికన ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. యూరియా కొరత, తద్వారా ఏర్పడిన ఇబ్బందులు, రాత్రి పూట సదరు రైతుల సాక్షిగా మాట్లాడిన మాటలతోపాటు శనివారం కాంగ్రెస్ నాయకులు, ఆ రైతులతో మాట్లాడించి రికార్డు చేయించిన వాయిస్‌ల సారాంశాన్ని కండ్లకు కట్టినట్టు ప్రచురించింది. నిజానికి ఈ కథనం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఎరువులపై నిజాలు మాట్లాడితే రైతుతో సారీ చెప్పించే స్థాయి వరకు అధికార పార్టీ నాయకులు సీన్ తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీలోనూ ఈ కథనం కలకలం రేపింది. రికార్డు చేసి, మీడియాకు విడుదల చేసినప్పడు ఆ విషయాన్ని ఎందుకు పరిశీలించలేదని కొంతమందిపై అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
అధికార పార్టీ చెప్పినట్టు యూరియా కొరత లేకుంటే ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో రుద్రంగిలోని ఆగ్రో సేవా కేంద్రం వద్దకు వందలాది మంది రైతులు ఎందుకు తరలివచ్చారన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే వారు కరువయ్యారు. శనివారం రాత్రి యూరియా స్టాక్ వచ్చిందని తెలుసుకున్న రుద్రంగి మండలంలోని వివిధ తండాలు, గ్రామాలకు చెందిన రైతులు.. యూరియా తీసుకెళ్లడానికి ఉదయం తొమ్మిది గంటలకే వందలాదిగా ఆగ్రో సేవా కేంద్రానికి తరలివచ్చారు. అక్కడే గంటలకొద్దీ నిరీక్షించారు. ఆ తర్వాత అధికారులు వచ్చి, రైతులకు యూరియా పంపిణీ చేశారు. కేవలం 450 బస్తాలు మాత్రమే వచ్చిందని చెప్పిన అధికారులు, వాటిని మధ్యాహ్నం రెండు గంటల దాకా పంపిణీ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన చాలామంది రైతులు, గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మానాల సొసైటీ వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ యూరియా తీసుకోవడానికి చాలామంది రైతులు తరలి వచ్చారు. మానాల సొసైటీ పరిధిలో మొత్తం 80 టన్నుల యూరియా కావాలని కోరగా, అక్కడికి 30 టన్నులు మాత్రమే సరఫరా అయింది. దీంతో యూరియా కోసం వచ్చిన చాలామంది వెనుదిరిగారు. నిజానికి రుద్రంగి, మానాల పరిధి రైతులకూ యూ రియా అవసరం ఉన్నది. భేషజాలకు పోకుం డా రైతుల అవసరాల మేరకు యూరియా తెప్పించి సరఫరా చేయాలన్న డిమాండ్ ఉన్నది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై ఇక ముందైనా.. యథార్థాలు మాట్లాడుతారా? లేక బుకాయింపులే చేస్తారా? చూడాలి.
ప్రజాపాలన అంటే రైతులను గోసపెట్టడమేనా? అని బీఆర్ఎస్ రుద్రంగి మండలాధ్యక్షుడు దేగావత్ తిరుపతి ప్రశ్నించారు. వరినాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా.. యూరియా ఇంకెప్పుడిస్తరని మండిపడ్డారు. యూరియా కోసం సొసైటీల చుట్టూ ఇంకెన్ని రోజులు తిరగాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మీడియాతో మాట్లాడారు. రైతులకు యూరియా, రైతుభరోసా, నాణ్యమైన కరెంట్, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని అన్నారు. 20 రోజుల నుంచి రైతులు యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన చెందారు. యూరియా కోసం పడుతున్న బాధలను మీడియాకు స్వచ్ఛందంగా చెప్పుకొన్న వారిని కాంగ్రెస్ నాయకులు బెదిరించడం సరికాదని మండిపడ్డారు.