హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను పెద్దలు కాజేస్తుంటే, జిల్లాల్లోని ముఖ్యనేతలు విలువైన భూములపై కన్నేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని 658 ఎకరాల భూమిపై తాజాగా వారి కన్నుపడింది. దీని విలువ సుమారు రూ.1300కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో కొంత ప్రభుత్వ భూమి కాగా, మరికొంత అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ భూములన్నింటినీ టీజీఐఐసీకి బదలాయించి, అక్కడి నుంచి అగ్గువకు కొనుగోలు చేసేలా కంపెనీల సిండికేట్ పక్కా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తున్నది. ప్లాన్లో భాగంగానే.. 44 ఎకరాల ప్రభుత్వ భూముల్లో గతంలో పంపిణీ చేసిన ఇండ్ల పట్టాలను రద్దు చేసినట్టు తెలుస్తున్నది.
మిగతా భూమి కోసం ఆ ముఖ్యనేత ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఓ కార్పొరేషన్ చైర్మన్ తన గుప్పిట్లో ఉండటంతో పని సులభంగా అవుతుందని నమ్మించినట్టు తెలిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మహ్మదాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 22లో 321 ఎకరాలు, మునిదేవునిపల్లిలోని సర్వే నంబర్ 92లో 293 ఎకరాలు, ఆలియాబాద్లోని సర్వే నంబర్ 418లో 44 ఎకరాలు కలిపి మొత్తం 658 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇందులో సగం భూములను అసైన్డ్ రైతులు సాగు చేసుకుంటుండగా, మిగిలినవి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉండడంతో వీటి ధర రూ.కోట్లల్లో పలుకుతున్నది.
ఈ భూములపై స్థానిక కాంగ్రెస్ ముఖ్యనేత కన్ను పడింది. వాటిని ఎలాగైనా కొల్లగొట్టేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. వాటిని దక్కించుకోవాలంటే కంపెనీలకు విక్రయించడం ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆ భూములను టీజీఐఐసీకి బదిలీ చేసి, ఆ తర్వాత తాము ఎంపిక చేసిన కంపెనీలకు అగ్గువకు కట్టబెట్టేలా ప్లాన్ వేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ప్లాన్లో మొదటిదశను అమలుచేశారని చెప్పుకుంటున్నారు. ఆలియాబాద్లోని 44 ఎకరాల భూమిని గతంలో పేదలకు ఇండ్ల పట్టాల కోసం పంపిణీ చేశారు. ముఖ్యనేత ఆదేశాలతో ఈ పట్టాలను రద్దుచేశారని, 44 ఎకరాలను టీజీఐఐసీకి బదిలీ చేశారని పేర్కొంటున్నారు.
658 ఎకరాలను ఎంపిక చేసిన వివిధ కంపెనీలకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయం జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల ప్రతినిధులు ఓ సిండికేట్గా ఏర్పడ్డారని తెలిసింది. జిల్లా ముఖ్యనేత నేతృత్వంలో ఈ సిండికేట్ పావులు కదుపుతున్నట్టు తెలిసింది. 44 ఎకరాల్లో ఇండ్ల పట్టాలు పొందినవారితో, అసైన్డ్ రైతులతో సిండికేట్ ప్రతినిధులు సదరు నేత సమక్షంలో చర్చలు జరిపినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. బాధితులకు ప్రభుత్వం ద్వారా అందే నష్టపరిహారంతోపాటు ఆయా కంపెనీల నుంచి కొంత మొత్తాన్ని చెల్లించేలా ఒప్పందం జరిగిందనే వాదన వినిపిస్తున్నది. కాంగ్రెస్ నేత మాట వినకపోతే వచ్చే పరిహారం కూడా రాదని, ఇతరులకు అమ్ముకునే అవకాశం కూడా ఉండదని బెదిరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో ఇండ్ల పట్టాలు పొందినవారు, అసైన్డ్ రైతులు తమ భూములను వదులుకునేందుకు సిద్ధపడినట్టు తెలిసింది. ఇలా సేకరించి, టీజీఐఐసీకి అప్పగించిన 44 ఎకరాలను ఓ బేవరేజెస్ కంపెనీ పేరుతో కేటాయించాలని నిర్ణయించినట్టు సమాచారం. మిగతా 614 ఎకరాల భూములను కూడా హస్తగతం చేసుకొని, కొంత రెండు బీర్ల కంపెనీలకు, మరికొంత చిన్న కంపెనీల పేర కేటాయించాలని నిర్ణయం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. జిల్లా నేత ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఆ భూములను టీజీఐఐసీకి బదలాయించే ప్రక్రియ చేపట్టినట్టు తెలిసింది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
మహ్మదాపూర్, ఆలియాబాద్, మునిదేవునిపల్లి తదితర ప్రాంతాల్లో భూముల ధర ఎకరాకు సుమారు రూ.2కోట్లు పలుకుతున్నది. ఈ లెక్కన 658ఎకరాల భూమి విలువ సుమారు రూ.1,300 కోట్లకుపైగా ఉంటుంది. టీజీఐఐసీ మాత్రం వాటిని కంపెనీలకు కేవలం రూ.25-30 లక్షలకు ఎకరం చొప్పున కేటాయించనున్నట్టు తెలిసింది. అసైన్డ్ రైతులు, ఇండ్ల పట్టాలు తిరిగి ఇచ్చిన వారికి ప్రభుత్వం ద్వారా ఎకరాకు రూ.15లక్షలు, కంపెనీల ద్వారా మరో రూ.10 లక్షల చొప్పున చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే, ఎకరా రూ.2కోట్ల విలువైన భూమిని కేవలం రూ.30 లక్షలకు కంపెనీలకు ధారాదత్తం చేసేలా ప్లాన్ వేసినట్టు చెప్తున్నారు.
ఇందులో అసలు మతలబు వేరే ఉన్నదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. భూములు కేటాయించాలని నిర్ణయించిన కంపెనీల్లో సదరు నేతకు చెందిన అనుచరులకు వాటా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. కంపెనీలకు భూములు కేటాయించాక, వారు తమ వాటాలను ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటారని పేర్కొంటున్నారు. గతంలో సంగారెడ్డి ప్రాంతంలో ఇలాగే జరిగిందని స్థానికులు వెల్లడిస్తున్నారు. గతంలో కంపెనీల పేరుమీద భూములు పొంది, ఆ తర్వాత వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించిన ఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి కంపెనీపేర భూములు కేటాయిస్తే వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం అసాధ్యమని, కంపెనీలు రకరకాల కారణాలతో న్యాయస్థానాలను ఆశ్రయించి, కేసును ఏండ్ల తరబడి సాగదీస్తుంటాయని చెప్తున్నారు.