కంఠేశ్వర్, మార్చి 21 : మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు శుక్రవారం ఆందోళనకు దిగాయి. కాంట్రాక్టులు, బిల్లులు విషయంలో సతాయిస్తున్నారంటూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 300 మంది కి పైగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు పోచారం డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పార్టీలో తమకు తగిన గుర్తింపు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆందోళన బాటపట్టారు. కాంట్రాక్ట్, నిధుల మంజూరు విషయంలో ఒత్తిడికి గురై బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ గుండెపోటుతో మరణించాడని తెలిపారు. మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట బైఠాయించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ శ్రేణులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్‌కు వచ్చారు. పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి బయటకు తీయకుండా అడ్డుకోడంతో కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళన అనంతరం అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్‌ను కలిశారు. బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను గ్రామసభల ద్వారానే కేటాయించేలా చూడాలని వినతిపత్రం సమర్పించారు.