మరిపెడ, ఆగస్టు 26 : యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నా సీఎం రేవంత్‌రెడ్డికి పట్టింపు లేదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఖమ్మం-వరంగల్ రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిపెడ, చిన్నగూడురు మండలాలకు చెందిన రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా పాల్గొన్న రెడ్యానాయక్ మాట్లాడుతూ.. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులను నిలదీస్తే తప్ప రైతుల పరిస్థితి మారే అవకాశం లేదని తెలిపారు. యూరియా కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు.