Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు గత 15 నెలలుగా చెప్తున్నది నిజమా? లేక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోని అంశాలు నిజమా? ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే చర్చ జరుగుతున్నది. తెలంగాణ దివాలా తీసింది, మూలధన వ్యయాన్ని సమకూర్చే పరిస్థితి కూడా లేదంటూ వెళ్లిన ప్రతిచోట ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తున్నారు. కానీ బడ్జెట్ పద్దు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రభుత్వాధినేతలు చెప్తున్నదానికి, బడ్జెట్లో పేర్కొన్న అంశాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు.
రాష్ట్ర రైతుల నుంచి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాల్‌కు రూ.500 చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని (బోనస్) ఇస్తున్నాం. ఈ హామీ అమలు వల్లనే రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోనస్ వల్లనే రాష్ట్రంలో సన్నరకాల వరిసాగు 25 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు పెరగటం వాస్తవమే కావచ్చు. అంటే 40 లక్షల ఎకరాల్లో ఎకరాకు కనీసంగా 20 క్వింటాళ్ల ధాన్యం చొప్పున మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఈ లెక్కన 2025-26 బడ్జెట్లో క్వింటాల్‌కు రూ.500 బోనస్ కింద రూ.4000 కోట్లను కేటాయించాలి. కానీ బడ్జెట్లో వరి బోనస్‌కు రూ. 1800 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ లెక్క ప్రకారం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే ఉత్పత్తి అవుతుందని అంచనా వే సిందా లేక మిగిలిన ధాన్యానికి బోనస్ ఎగ్గొట్టనున్నారానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, క్షేత్రస్థాయిలో సర్వే చేసి, గ్రామసభల్లో ధ్రువీకరించి, సాగుకుయోగ్యంకాని భూమిని గుర్తించడం ద్వారా ఈ వృథాను అరికట్టాం. రైతుభరోసాకు ఈ బడ్జెట్లో రూ.18 వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సుమారు 69 లక్షల మంది రైతులకు దాదాపు 1.53 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందేది. ఇందుకుగాను కేసీఆర్ సర్కారు ఒక్కో సీజన్‌కు రూ.7,500 కోట్లు విడుదల చేసింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు రూ.18వేల కోట్లు కేటాయించింది. అంటే సీజన్‌కు రూ.9వేల కోట్లు.
‘అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపలేను.. ఆకాశసౌధాలు కట్టదలచుకోలేదు.. వాస్తవాల ప్రాతిపదికన నడుచుకుంటాం. ఏది ఉంటే అదే చెప్తాం..’ ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది (2024-25) బడ్జెట్‌ను రూ.2.91 లక్షల కోట్లుగా చూపి, తాజాగా 2025-26 బడ్జెట్‌ను రూ.3.04 లక్షల కోట్లుగా చూపారు. సాధారణంగా బడ్జెట్ రూపకల్పనలో ఏటా 15 శాతం వృద్ధిని పరిగణలోనికి తీసుకుంటారు. ఈ క్ర మంలో తాజా బడ్జెట్ పరిమాణం రూ.3.35 లక్షల కోట్లుగా ఉండాలి.
మరి.. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపలేమన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏ ప్రాతిపదికన తాజా బడ్జెట్‌ను రూ.3.04 లక్షల కోట్లుగా రూపకల్పన చేశారు. సీఎం చెబుతున్న ‘తెలంగాణ దివాలా’ నిజమా? మునుపటికంటే బడ్జెట్ పెరిగినందున ఆ మేరకు ఆర్థిక వృద్ధి జరిగిందనేది నిజమా?